Begin typing your search above and press return to search.

మంగళగిరి పోలీసుల్ని హైకోర్టు తాజాగా ఎందుకు తప్పు పట్టింది?

By:  Tupaki Desk   |   29 Oct 2020 4:45 AM GMT
మంగళగిరి పోలీసుల్ని హైకోర్టు తాజాగా ఎందుకు తప్పు పట్టింది?
X
ఏపీ పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కేసు విషయంలో నిబంధనలు పాటించని వైనంపై ఫైర్ అయిన న్యాయస్థానం.. పోలీసులు కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేసుకోవచ్చని పేర్కొన్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఆర్పీసీ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇవ్వకపోవటాన్ని తప్పు పట్టింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఉన్నప్పటికి.. దాని అమలు చేయకపోవటం సరి కాదని పేర్కొంది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు ఎదురైందన్న విషయంలోకి వెళితే..

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ అలాంటిదేమీ చేయకపోవటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కారణగా పరిగణించొచ్చని స్పష్టం చేసింది.

ఈ నెల 21న మంగళగిరి పోలీసులు సాంబశివరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా కేసు నమోదు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సాంబశివరావు. ఉండవల్లికి చెందిన ఆయన మంగళగిరి పోలీసుల తీరును తప్పు పడుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు ఇవ్వకుండా కేసు నమోదు చేయటం చట్టవిరుద్దమని.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించినట్లేనన్నది ఆయన వాదన. ఇదే అంశాన్ని సాంబశివరావు తరఫున్యాయవాది ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మంగళగిరి పోలీసుల తీరును తప్పు పట్టింది. పిటిషనర్ కోరినట్లుగా.. పోలీసులు తదుపరి చర్యలు చేపట్టకుండా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గరిష్ఠంగా ఏడేళ్లు శిక్ష పడే కేసుల్లో నిందితులకు 41ఏ ప్రకారం తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గతంలోనే సుప్రీం స్పష్టం చేసింది. మంగళగిరి పోలీసులు సుప్రీంకోర్టు తీర్పును పాటించకుండా.. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లుగా సాంబశివరావు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఇష్యూలో పోలీసులు తమ ఆదేశాల్ని పాటించని పక్షంలో వారిపై కోర్టు ధిక్కారణ నేరాన్ని సుమోటోగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంగళగిరి పోలీసులు హైకోర్టు ఆదేశాల్ని పాటిస్తారో లేక మరింత మొండిగా వ్యవహరిస్తారో చూడాలి.