జగన్ హత్యయత్నం కేసులో కీలక మలుపు - శ్రీనివాస్ బెయిల్ రద్దు

Fri Jul 19 2019 18:13:09 GMT+0530 (IST)

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ హత్యాయత్నం కేసు కొత్త మలుపు తీసుకుంది. గత ఏడాది అక్టోబరు 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యయత్నం చేసిన శ్రీనివాసరావు బెయిలును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు మధ్యాహ్నమే వెలువడ్డాయి. దాడి సమయంలో శ్రీనివాసరావు పదునైన కోడి కత్తితో అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్ పై దాడి చేశారు. జగన్ చురుగ్గా కదిలి పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. చేతికి బలమైన గాయమైంది. జగన్ సిబ్బంది వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా... కోర్టు రిమాండు విధించింది. ఏడు నెలల పాటు జైలులో ఉన్న శ్రీనివాసరావుకు మే 22న బెయిలు మంజూరు అయ్యింది. మే 25న అతను జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే ఈ బెయిలును వ్యతిరేకిస్తూ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైకోర్టులో పిటిషను దాఖలు చేసింది.

నిందితుడు శ్రీనివాసరావుకు కింది కోర్టు బెయిలు ఇచ్చిందని బెయిలుకు సరైన కారణాలు కూడా చూపలేదని ఎన్ ఐఏ తెలిపింది. విచారణ పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని ఎన్ ఐఏ పేర్కొంది. ఈ విచారణకు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది కూడా హాజరయ్యారు. నిందితుడు సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈ నేపథ్యంలో అతను రిమాండ్ లో ఉంటేనే ఈకేసు విచారణ వేగంగా కచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శ్రీనివాస రావు బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. నిందితుడు బెయిల్‌పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని మాత్రం న్యాయస్థానం కల్పించడం గమనార్హం.

కేసు పూర్వపరాలు

* జగన్ గత ఏడాది పాదయాత్రలో ఉండగా... హైదరాబాదుకు వెళ్లేటపుడు విశాఖపట్నం విమానాశ్రయంలో పక్కా ప్లాన్ ప్రకారం జగన్ హత్యకు ప్రయత్నంచారు.

* నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం నేతకు చెందిన క్యాంటీన్ లో పనిచేస్తుండటం అప్పట్లో సంచలనం అయ్యింది.

* డీజీపీ ముఖ్యమంత్రి చులకనగా మాట్లాడటం అప్పట్లో ప్రజల్లో అనుమానాలు కలిగించింది.

* జగన్ ప్రాథమిక చికిత్స చేయించుకుని అలాగే హైదరాబాదు వెళ్లడంతో విశాఖ ప్రశాంతంగా ఉంది. సంయమనం పాటించమని జగన్ కోరారు.

* అప్పట్నుంచి రిమాండ్ లో ఉన్నా శ్రీనివాస్ మే 22న బెయిలు పొందారు.

* ఘటన ప్రాంతం పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని ఈ చట్టంలోని సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని ఎన్ఐఏ కోర్టులో వాదించడంతో తాజాగా బెయిలు రద్దు అయ్యింది.