హైకోర్టు లాయర్ కారును ఢీ కొట్టిన లారీ.. నిజంగానే బ్రేక్ ఫెయిల్ అయ్యిందా?

Tue Feb 23 2021 11:00:01 GMT+0530 (IST)

High Court Advocate Durgaprasad accident

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల్ని నడిరోడ్డు మీద దారుణంగా హతమార్చిన వైనం మర్చిపోక ముందే.. మరో ఉదంతం కలకలాన్ని రేపుతోంది. తాజాగా హైకోర్టు లాయర్ ఒకరు తన లాయర్ మిత్రుడితో కలిసి ఊరికు వెళుతున్న వేళలో.. కాపర్ లోడ్ తో ఉన్న లారీ ఒకటి వెనుక నుంచి ఢీ కొట్టిన వైనం సంచలనంగా మారింది. బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నప్పటికి.. పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అదే సమయంలో ప్రమాదానికి గురైన కారులో ఉన్న న్యాయవాది దుర్గాప్రసాద్.. భూవివాదానికి సంబంధించిన కేసులో వాదించేందుకు ఊరికి వెళ్లటం గమనార్హం. హైదరాబాద్ లోని యూసఫ్ గూడకు చెందిన హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్.. తన తోటి లాయర్ క్రిష్ణమూర్తితో కలిసి వరంగల్ కోర్టుకు వెళుతున్నారు. జనగామ జిల్లా యశ్వంతాపురం వద్ద సడన్ గా వెనుక నుంచి వస్తున్న లారీ.. కారును ఢీ కొట్టింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ లారీకి బ్రేకులు ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు.

ఆస్తి తగాదాకు సంబంధించిన కేసును వాదించేందుకు తాను వెళుతున్నానని.. ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉన్నట్లుగా లాయర్ దుర్గా ప్రసాద్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేసినట్లుగా అనిపిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. లాయర్ దంపతుల దారుణ హత్య ఉదంతం ఒక కొలిక్కి రాక ముందే..రాష్ట్ర హైకోర్టుకు చెందిన మరో లాయర్ కారును లారీ ఢీ కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.