Begin typing your search above and press return to search.

గాంధీలో కరోనా టెస్టులు ఎందుకు చేయడంలేదు : తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం !

By:  Tupaki Desk   |   14 July 2020 4:00 PM GMT
గాంధీలో కరోనా టెస్టులు ఎందుకు చేయడంలేదు : తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం !
X
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంది. రాష్ట్రంలో ప్రతి రోజు కూడా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి . రాష్ట్రంలో నమోదు అయ్యే కేసుల్లో ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలం అయింది అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా టెస్టులు, చికిత్స తీరుతెన్నులపై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ విచారణలో భాగంగా హైకోర్టు రాష్ట్ర కరోనా స్పెషల్ హాస్పిటల్ గా ఉన్న గాంధీ హాస్పిటల్ లో ఎందుకు కరోనా టెస్టులు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గాంధీలో టెస్టులు చేయకపోవడం పై విస్మయం వ్యక్తం చేసింది. అలాగే , గాంధీ ఆసుపత్రి లో కరోనా టెస్టులు జరపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కి ఫీజులని నిర్ణయించాలని తెలిపింది. కరోనా రోగుల నుంచి రూ.4 లక్షలకు పైగా బిల్లులు వసూలు చేసిన యశోద, కిమ్స్ ఆసుపత్రులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే , నాచారం ఈఎస్ ‌ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా లేదో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.