Begin typing your search above and press return to search.

పాప ఊపిరి ఆగింది.. మీరిచ్చిన విరాళాల్ని తిరిగి ఇచ్చేస్తాం

By:  Tupaki Desk   |   16 Jun 2021 3:30 AM GMT
పాప ఊపిరి ఆగింది.. మీరిచ్చిన విరాళాల్ని తిరిగి ఇచ్చేస్తాం
X
అయ్యో అనిపించే విషాద ఉదంతంగా చెప్పాలి. అరుదైన స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపీ వ్యాధితో బాధ పడుతున్న ముద్దులొలికే ఏడు నెలల చిన్నారి ఊపిరి ఆగింది. అరుదైన వ్యాధితో బాధ పడుతూ.. దాని నివారణ కోసం రూ.16 కోట్ల ఇంజక్షన్ కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్న వేళ.. అనూహ్యంగా కన్ను మూసింది. రాజస్థాన్ లోని బికనీర్ లో చోటు చేసుకున్న ఈ విషాదం పలువురిని వేదనకు గురి చేసింది.

బికనీర్ కు చెందిన ఏడు నెలల నూర్ ఫాతిమా అరుదైన వ్యాధితో బాధ పడుతోంది. రూ.16 కోట్ల విలువ చేసే జొలెస్మా ఇంజెక్షన్ వాడితే ప్రయోజనం ఉంటుందని చెప్పటంతో.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈ ఇంజెక్షన్ విలువ రూ.22 కోట్లు. దాని మీద విధించే పన్నుల్ని కేంద్రం మినహాయిస్తోంది. ఇదిలా ఉంటే.. కోట్లాది రూపాయిల విలువ చేసే ఈ ఇంజెక్షన్ కోసం పాప తల్లిదండ్రులు సాయాన్ని కోరారు. అందుకు తగ్గట్లే.. పలువురు స్పందిస్తున్నారు.

ఇప్పటివరకు రూ.40 లక్షల మొత్తం విరాళాల రూపంలో అందుకున్నారు. బ్యాడ్ లక్ ఏమంటే.. సదరు చిన్నారి హటాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. పాలు తాగిన తర్వాత నిద్ర పోయిందని.. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లుగా పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యతోనే హైదరాబాద్ కు చెందిన చిన్నారి బాధపడటం.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కోట్లాది రూపాయిల విరాళాల్ని సేకరించి బతికించారు. ఈ క్రమంలో బికనీర్ చిన్నారిని కూడా కాపాడతామని భావించారు. కానీ.. అనుకోని రీతిలో ఆ పాప మరణించింది. దీనిపై పాప తల్లిదండ్రులు స్పందిస్తూ.. తమ చిన్నారి కోసం విరాళాలు ఇచ్చిన వారందరి డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.