హెచ్చరికో హెచ్చరిక.. భాగ్యనగర వాసులారా.. బయటకు రావొద్దు!!

Tue Jun 28 2022 20:26:59 GMT+0530 (IST)

Heavy downpour in Hyderabad

మీరు చదివింది కరెక్టే..!  ఈ హెచ్చరిక.. మన హైదరాబాద్.. మనం మెచ్చిన హైదరాబాద్.. మనందరం మెచ్చిన భాగ్యనగరం గురించే..!! ఇంటి నుంచి బయటకు కాలు పెట్టొద్దని.. ఘనత వహించిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ హెచ్చరించింది. ఇంటింటికీ దండోరా వేసినట్టు మరీ.. ప్రచారం చేసింది. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు?  తెలుసుకుని తరించండి..  మన జీహెచ్ ఎంసీ ఘనతను!!హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. వాన తీవ్రతకు పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడగా.. రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ రాత్రి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో సికింద్రాబాద్ మేడ్చల్ జిల్లా పరిధిలో భారీవర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలోని బాలా నగర్ కుత్బుల్లాపూర్ చింతల్ జీడిమెట్ల జగద్గిరిగుట్ట కొంపల్లి సుచిత్ర దుండిగల్ కుషాయిగూడ దమ్మాయిగూడ చర్లపల్లిలో వర్షం పడింది. మల్కాజిగిరి పరిసరాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో నాలలు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇవాళ రాత్రి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటికిరావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్‌గా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే మధ్యాహ్నం నుంచి కురుస్తున్నవానతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ అల్వాల్ నెరేడ్‌మెట్‌లలో ఎక్కువ వర్షప్రభావం చూపింది.

సుమారు గంటకు పైగా కురిసిన భారీవర్షంతో నాలాలు నిండిపోయి నీరంతా రహదారులపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. శేరిలింగంపల్లి అల్వాల్ నాగారం మల్కాజిగిరిలోనూ జోరు వాన కురిసింది. కాప్రా కుషాయిగూడ తార్నాక లాలాపేట హబ్సిగూడ నాచారం మల్లాపూర్‌లో భారీ వర్షం పడింది. దీంతో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దంటూ.. జీహెచ్ ఎంసీ హెచ్చరించింది.

చెప్పింది.. చేతగాక!!

ఎక్కడికక్కడ నోళ్లు తెరిచిన మ్యాన్ హోల్స్.. నిర్వహణలేని మురుగు కాల్వలు.. నల్లాలు.. కారణంగా.. ఏమాత్రం ఓ రేంజ్లో వర్షం కురిసినా.. భాగ్యనగరంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే.. ఈ ఏడాది 12 మంది వరకు ఇలా మ్యాన్ హోల్స్‌లో పడి కొట్టుకుపోయారు. అదేవిధంగా నల్లాలు పారి.. ప్రమాదాలు జరిగాయి. ఇళ్లు మునిగిపోయాయి. అయితే.. ఎన్నికల సందర్భంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం తప్పక చూపిస్తామన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఫలితంగా ఇప్పుడు తమ నిర్వాకంతో ఏం జరుగుతుందోనన్న బెంగతో ప్రజలను ఇంటి నుంచి బయటకు రావొద్దని దండోరా వేయడం గమనార్హం.