Begin typing your search above and press return to search.

ఇప్పటివరకు విని ఉండరు..గుండెపోటు రోగికి వైద్యం చేస్తున్న వైద్యుడికి గుండె ఆగింది

By:  Tupaki Desk   |   29 Nov 2021 1:30 PM GMT
ఇప్పటివరకు విని ఉండరు..గుండెపోటు రోగికి వైద్యం చేస్తున్న వైద్యుడికి గుండె ఆగింది
X
చావు కంటే సిత్రమైనది ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. తన రాకతోనే ఎంతటి వారినైనా శోకసంద్రంలో ముంచెత్తె చావుకు ఉన్న గొప్పతనం.. ఎప్పుడూ కూడా తన మీద నెపాన్ని వేసుకోదు. ఏదో ఒక కారణాన్ని చూపించి.. చావుకు తాను కారణం కాదంటూ నిందను వేరే వారి మీద మోపటం దీనికున్న అతి పెద్ద గుణం. కామారెడ్డికి సమీపంలోని గాంధారిలో తాజాగాచోటు చేసుకున్న ఈ ఉదంతం విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. విస్మయానికి గురి కావటం ఖాయం. ఎంతకూ జీర్ణించుకోలేని ఈ విషాద ఉదంతంలోకి వెళితే..
కామారెడ్డి జిల్లా గాంధారిలో వైద్యుడిగా పని చేస్తుంటారు 43 ఏళ్ల డాక్టర్ లక్ష్మణ్. వైద్యుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున స్థానిక గుజ్జుల్ తండాకు చెందిన 48 ఏళ్ల రైతు జాగ్యానాయక్ కు గుండె పోటుకు గురయ్యారు. దీంతో.. అతడ్ని వెను వెంటనే దగ్గర్లోని గాంధారిలో ఉన్న లక్ష్మణ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అతడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో.. స్పందించిన డాక్టర్ లక్ష్మణ్ వెంటనే అతడికి వైద్యం చేయటం షురూ చేశారు.
చికిత్స చేస్తున్న డాక్టర్ లక్ష్మణ్ సైతం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వైద్యం చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో.. షాక్ తిన్న అక్కడి వైద్య సిబ్బంది స్పందించి ఆయనకు ప్రధమ చికిత్స చేస్తున్నంతలోనే.. ఆయన కన్నుమూశారు. దీంతో.. ఆసుపత్రి వర్గాలు షాక్ తిన్నాయి.

వైద్యం చేస్తున్న వైద్యుడు మరణించటంతో.. రోగి బంధువులు జాగ్యానాయక్ ను మరో ఆసుపత్రికి తరలిస్తుండగానే.. అతను మరణించారు. ఇలా నిమిషాల వ్యవధిలోనే వైద్యుడు.. అతడు వైద్యం చేస్తున్న రోగి కన్నుమూయటంతోఅక్కడ విషాదం నెలకొంది. ఇలాంటి అనూహ్య సంఘటన ఇప్పటివరకు ఎప్పుడూ వినలేదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.