Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ పోలీసులు తాళం లాక్కున్నారన్న కోపంతో బైక్ తగలెట్టేశాడు

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:48 AM GMT
ట్రాఫిక్ పోలీసులు తాళం లాక్కున్నారన్న కోపంతో బైక్ తగలెట్టేశాడు
X
రాంగ్ రూట్లో వచ్చే టూవీలర్ ను ఆపేయటం.. బండి ఆగిన వెంటనే.. సదరు వాహన తాళాన్ని లాగేసుకొని.. తమ వద్ద ఉంచుకొని చలానా విధించటం లాంటి సీన్లు హైదరాబాద్ మహానగరంలో చాలా సందర్భాల్లో కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి సీన్ మరోసారి చోటు చేసుకుంది.

అయితే.. ఈసారి రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వస్తున్న తన వాహన తాళాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లాక్కున్న నేపథ్యంలో సదరు బైక్ యజమాని గుస్సా అయ్యాడు. అంతేకాదు.. తన వాహనాన్ని తాను తగలబెట్టేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.

ఎస్ ఆర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుందన్న విషయానికి వెళితే.. ఎల్లారెడ్డిగూడకు చెందిన 45 ఏళ్ల అశోక్ అమీర్ పేట మైత్రీవనంలోని అన్నపూర్ణ బ్లాక్ లో మొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు. సోమవారంసాయంత్రం అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద యూ టర్న్ తీసుకొని ఎదురుగా ఉన్న అన్నపూర్ణ బ్లాక్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

అక్కడే ఉన్న హోంగార్డు వాహనాన్ని ఆపి.. రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తన షాపు ఎదురుగా ఉందని యజమాని చెప్పినా వినిపించుకోలేదు. వాహన తాళాన్ని లాగేసుకొని తన వద్ద ఉంచేసుకున్నాడు. దీంతో.. అశోక్ ఆగ్రహానికి గురయ్యాడు. తన దుకాణంలోకి వెళ్లి.. పెట్రోల్ సీసాను తీసుకొచ్చి బైక్ మీద చల్లి నిప్పు అంటించారు. అనూహ్య పరిణామంతో అక్కడి వారు షాక్ తిన్నారు.

ఈ ఉదంతంలో బైక్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. తాను అవతలివైపు నుంచి యూటర్న్ తీసుకొని తన దుకాణంలోకి వెళుతుంటే ఆపారని.. అక్కడే ఒక ఖరీదైన కారు రాంగ్ రూట్లో వస్తున్నా పట్టించుకోలేదన్నది అశోక్ వాదన. వాహనాన్ని దగ్థం చేసిన ఉదంతంలో శాంతిభద్రతల సమస్యకు కారణమైన అశోక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. రాంగ్ సైడ్ లో వస్తున్న అశోక్ తో ప్రమాదమని భావించి తాను వాహనాన్ని ఆపినట్లుగా హోంగార్డు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఉదంతం చుట్టుపక్కల వారికి షాకింగ్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.