అబ్బాయే వచ్చాడు.. అచ్చం నాన్నలాగే ఆడుతున్నాడు

Sat Dec 10 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

He has come.. He's playing like his dad.

మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు. అలాగే తండ్రి పోలికలు కుమారుల్లో ఎక్కువగా ఉండడం చూస్తుంటాం. అయితే క్రికెట్ లోనూ ఇలాంటి పోలికలుంటాయి. కానీ అది ఆటలో. తండ్రికి తగినట్లుగా ఆడుతున్నాడా? అనే అంచనాలు ఉంటాయి. కాగా క్రికెట్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ సక్సెస్ అయిన సందర్భాలు లేవు. ఉదాహరణకు సునీల్ గావస్కర్ ఎంత గొప్ప బ్యాట్స్ మనో చెప్పాల్సిన పనిలేదు. ఆయన కుమారుడు రోహాన్ గావస్కర్ మాత్రం సగటు క్రికెటర్ గా మిగిలిపోయాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంకా ఆపసోపాలు పడుతున్నాడు. యువరాజ్ సింగ్ ప్రస్థానం మాత్రం దీనికి భిన్నం. అతడి తండ్రి యోగరాజ్ సింగ్ టీమిండియాలో ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయాడు. యువరాజ్ మాత్రం డాషింగ్ బ్యాట్స్ మన్ స్పిన్ ఆల్ రౌండర్ గా టీమిండియాకు ప్రపంచ కప్ తెచ్చిపెట్టాడు. ఇలా
చెప్పుకుంటూ పోతే పాత తరంలో ఎన్నో ఉదాహరణలు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. వెస్టిండీస్ క్రికెటర్ శివనారాయణ్ చందర్ పాల్ కుమారుడు త్యాగరాజన్ చందర్ పాల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుండడమే.అచ్చం ఎలా సాధ్యం..? వెస్టిండీస్ క్రికెటర్ శివనారాయణ్ చందర్ పాల్ గొప్ప బ్యాట్స్ మన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. వేలాది పరుగులు చేసి ఒకప్పటి వెస్టిండీస్ కు వెన్నెముకలా నిలిచాడు. ముఖ్యంగా బ్రియాన్ లారా లేకుంటే శివ నారాయణే ఇప్పటికీ విండీస్ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా మిగిలిపోయేవాడు. ఆయన కుమారుడే త్యాగరాజన్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విండీస్ జట్టు తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు త్యాగరాజన్. చిత్రమేమంటే.. త్యాగరాజన్ పూర్తిగా తండ్రి తరహాలోనే బ్యాట్స్ మన్. ఇంకా చిత్రమేమంటే చందర్ పాల్ అంటే భిన్నమైన స్టాన్స్. ఏ బౌలర్ కూ కొరుకుడు పడని విధంగా క్రీజులో అటు ఇటు కదులుతూ చిన్న పాటి నాట్యం చేస్తున్నట్లు శివనారాయణ్ బ్యాటింగ్ విన్యాసం సాగేది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే నిబంధనలకు భిన్నం అని మాత్రం ఎవరూ అనలేదు. ఇక ఈ తరంలో అలాంటి తరహా స్టాన్స్ ను ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్
స్మిత్ అనుసరిస్తున్నాడు. ఇప్పుడు శివనారాయణ్ కుమారుడు త్యాగరాజన్ కూడా తండ్రి స్టాన్స్ నే అచ్చు గుద్దినట్లుగా దింపేస్తున్నాడు. పొరపాటున కొత్తగా ఎవరైనా టీవీ ఆన్ చేసి ఆసీస్-విండీస్ టెస్టును చూస్తే శివనారాయణ్ మళ్లీ వచ్చాడా? అని భ్రమపడడం ఖాయం.

భారత సంతతి వారే శివనారాయణ్ పేరు చూస్తేనే చెప్పేయొచ్చు అతడు భారత సంతతి వాడని. అతడు మామూలు బ్యాట్స్ మెన్ కాదు. విండీస్ కు 164 టెస్టుల్లో ఆడి 11867 పరుగులు చేశాడు. 268 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి 8778 పరుగులు సాధించాడు. 22 టి20ల్లోనూ ఆడడం గమనార్హం. అప్పుడప్పుడూ బంతిని అందుకుని వికెట్లు తీసేవాడు. 1994 నుంచి 2015 వరకు టెస్టులు ఆడాడు. 1994-2011 మధ్య వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. కాగా శివనారాయణ్ కుమారుడు త్యాగరాజన్ 2011 నుంచి ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నాడు.

తండ్రీ కొడుకులు ఒకే మ్యాచ్ లో 2013లో అనుకుంటా.. శివనారాయణ్ త్యాగరాజన్ ఇద్దరూ ఒకే మ్యాచ్ లో కలిసి బరిలో దిగారు. ఇది విశేషమే. ఎందుకంటే అప్పటికి శివనారాయణ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పలేదు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ తొలి టెస్టులో త్యాగరాజన్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ రెండో ఇన్నింగ్స్ లో 40కి పైగా పరుగులు చేశాడు. శుక్రవారం ప్రారంబమైన రెండో టెస్టులోనూ త్యాగారాజన్ నిలకడగా ఆడుతున్నాడు. విశేషమేమంటే.. త్యాగరాజన్ కు టెస్టు అరంగేట్రం సందర్భంగా క్యాప్ అందించినది తన తండ్రితో దశాబ్దాల పాటు కలిసి ఆడిన విండీస్ దిగ్గజం బ్రయాన్ లారా కావడం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.