Begin typing your search above and press return to search.

కాపు నేస్తంలోనూ ల‌బ్ధిదారులు త‌గ్గిపోయారా?

By:  Tupaki Desk   |   26 Jun 2022 6:30 AM GMT
కాపు నేస్తంలోనూ ల‌బ్ధిదారులు త‌గ్గిపోయారా?
X
ఇప్ప‌టికే జ‌గ‌న‌న్న అమ్మ ఒడికి సంబంధించి అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే 52,463 మందికి ఈసారి ల‌బ్ధి చేకూర‌డం లేదని వార్త‌లు వ‌స్తుండ‌గా ఇప్పుడు కాపు నేస్తం వంతు వ‌చ్చింది. కాపు నేస్తంలోనూ 41 వేల పేర్లు ఈసారి లేవ‌ని ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కాపు నేస్తం ప‌థ‌కం కింద కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.15 వేలు సాయం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా గతేడాది కాపు నేస్తం కింద 3,27,244 మంది మ‌హిళ‌ల‌కు ఆర్థిక సాయం అందించారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే జూలై నెలలో మూడో విడత సాయం అందించ‌నున్నారు. వీరిలో 2,85,769 మంది పేర్లను మాత్రమే లబ్ధిదారుల నుంచి వేలిముద్ర తీసుకునేందుకు (ఈకేవైసీ) క్షేత్రస్థాయికి పంపించార‌ని ఏపీలో ప్ర‌ధాన‌ మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి. గతేడాది లబ్ధి పొందిన జాబితాలోని 41,475 మంది పేర్లు ఈసారి లేవ‌ని పేర్కొంటున్నారు. వీరు పేర్లు ఎందుకు తొలగించిందీ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నార‌ని వార్తా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

గతేడాది లబ్ధిదారుల జాబితాలో ఉన్న‌ 41,475 పేర్లు ఈసారి కొత్త జాబితాలో లేవ‌ని స‌మాచారం. వీరిలో 60 ఏళ్ల పైబడిన వారు, చనిపోయినవారిని తీసేసినా గల్లంతైన పేర్లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. వీరిలో కొంతమందికి ఇతర సంక్షేమ పథకాల కింద సాయం అందిందనే కారణంగా కాపు నేస్తాన్ని నిలిపేసినట్లు పేర్కొంటున్నారు.

మ‌రోవైపు ల‌బ్ధిదారులు త‌మ పేర్లు లేక‌పోవ‌డంతో వలంటీర్లు, వెల్ఫేర్ సెక్ర‌ట‌రీల‌ను నిల‌దీస్తున్నారు. తమ పేర్లు ఎందుకు జాబితాలో రాలేదని లబ్ధిదారులు వారిని నిల‌దీస్తున్నారు. మళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని చెప్పి వ‌లంటీర్లు, సంక్షేమ కార్య‌ద‌ర్శులు త‌ప్పించుకుంటున్నారని అంటున్నారు. కాగా తుది జాబితాను జులై 7న ప్రకటిస్తారు. అప్పటికి అర్హులుగా ఉన్నవారికి మాత్రమే కాపు నేస్తం సాయాన్ని అందిస్తారు.