మోడీ మొండితనమే ఇంతకు తెచ్చిందా ?

Sun May 09 2021 20:00:01 GMT+0530 (IST)

Has Modi brought stubbornness to this?

దేశంలో కరోనా తీవ్రత ఏ రేంజ్‌లో అందరికీ తెలిసిందే. గత ఏడాది వందల స్థాయిలో ఉన్న మరణాలు.. ఇప్పుడు రోజుకు వేల సంఖ్యలోకి చేరుకున్నాయి. వేల సంఖ్యలో ఉండాల్సిన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు లక్షల సంఖ్యలోకి చేరుకున్నాయి. మరి ఇంత ఉత్పాతాన్ని ఎవరూ ఊహించలేదా?  కరోనా విలయాన్ని ఎవరూ గుర్తించలేదా? అంటే.. గుర్తించామని.. హెచ్చరించామని అంటున్నారు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ). భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందని.. ఖచ్చితంగా ఇబ్బంది తప్పదని.. ముందుగానే మేల్కోవాలని.. చెప్పినట్టు.. తాజాగా ఐఎంఏ ప్రకటించింద.అయితే.. కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ.. తమ సూచనలను సలహాలను పట్టించుకోలేదని.. తాజాగా ఐఎంఏ దుమ్మెత్తిపోసింది. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య నిపుణుల సలహాలను బుట్టదాఖలు చేసిందంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా తోలుమందం వ్యవహారంతో ముందుకు పోయిందని ఆరోపించింది. లాక్‌డౌన్ తప్పనిసరి అనే సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ ధోరణిని తప్పుబట్టింది. కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పుడు రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సెకండ్‌వేవ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికైనా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాలని కోరింది.  వైరస్‌ను అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్‌డౌన్‌ను విధించాలని సూచించింది. తద్వారా వ్యాప్తిని నిరోధించడంతో పాటు వైద్య సిబ్బందికీ ఊపిరి పీల్చుకునే వీలు కలుగుతుందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న 10-15 రోజుల కట్టడి కాకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్ అవసరమని పేర్కొంది. రాత్రి కర్ఫ్యూలతో పెద్దగా ఉపయోగం ఉండదని తెలిపింది.

18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసువారికి టీకా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అవలంభించిన విధానాన్ని ఐఎంఏ తప్పుబట్టింది. సరైన ప్రణాళిక కొరవడటంతో.. టీకాలు అందక దేశంలో చాలాచోట్ల పంపిణీ నిలిచిపోయిందని విమర్శించింది. పోలియో మశూచి వంటి వ్యాధుల విషయంలో  జాతీయ టీకా విధానాన్ని పాటించగా.. ఇప్పుడెందుకు వేర్వేరు ధరలకు అందజేయాల్సి వస్తోందని ఐఎంఏ నిలదీసింది. ఆక్సిజన్ కొరత వైద్యులు వైరస్ భారిన పడడం వంటి సంఘటనలపై ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో సమృద్ధిగా ఉత్పత్తి ఉన్నప్పటికీ.. పెద్దసంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు కొరత ఎదుర్కొంటున్నాయంటే.. సరఫరాలో తప్పుడు విధానాలే కారణమని మండిపడింది.

కరోనా కేసులు మరణాలను ఎందుకు దాచిపెడుతున్నారని ఐఎంఏ ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్‌లో ఫాల్స్ నెగెటివ్ రిపోర్టు వచ్చి.. సీటీ స్కాన్‌లో పాజిటివ్‌గా తేలిన కేసుల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీసింది. ఆరోగ్య రంగానికి జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జరపాలని   సూచించింది. కరోనా కట్టడికి.. కంటైన్‌మెంట్ చర్యలు టీకా మందులు సిబ్బంది కొరతను అధిగమించేందుకు వ్యూహాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని కోరింది. ఈమేరకు ఐఎంఏ.. కేంద్రానికి ఘాటు లేఖ రాయడం గమనార్హం. మరి ఇప్పటికైనా.. మోడీ మారతారో లేదో.. చూడాలి..!