Begin typing your search above and press return to search.

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిణి వాలంటరీ రిటైర్మెంట్

By:  Tupaki Desk   |   30 July 2021 4:36 AM GMT
ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిణి వాలంటరీ రిటైర్మెంట్
X
ఒక సీనియర్ మహిళా ఐపీఎస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. పలు కీలక స్థానాల్లో పని చేసి.. మంచి పేరు తెచ్చుకున్న ఆమె తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయాన్ని తీసుకోవటం సంచలనమైంది. ఇంతకూ మీరు ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేశారు? అని ప్రశ్నిస్తే.. అందుకు ఆమె చూపిస్తున్న కారణం ఇప్పుడు అర్థం కానిదిగా మారింది. ఆమె ఉదంతం గురించి విన్నంతనే అభినవ మీరా గుర్తుకు రావటం ఖాయం. ఇంతకూ ఆ మహిళా ఐపీఎస్ ఎక్కడి వారు? ఆమె ఎందుకు వార్తల్లో వ్యక్తిగా మారారు? అన్న విషయాల్ని చూస్తే..

హర్యానా లోని అంబాలా రేంజ్ ఐజీగా వ్యవహరిస్తున్న భారతీ అరోరా తాజాగా తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లుగా వెల్లడించి సర్ ప్రైజ్ చేశారు. సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు పేలుడు దర్యాప్తుతో సహా పలు కీలక కేసుల్ని హ్యాండిల్ చేసిన ఆమె.. రిటైర్మెంట్ వయసు మిగిలిన ఉండగా.. ఇప్పటికిప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆమె చెబుతున్న సమాధానం సంచలనంగానే కాదు.. వైరల్ గా మారింది.

‘జీవితంలో అసలు లక్ష్యం దిశగా నా ప్రయాణం ప్రారంభిస్తాను. గురునానక్ దేవ్.. చైతన్య మహాప్రభు.. కబీర్ దాస్.. తులసీ దాస్ లాంటి వారు చూపించిన మార్గంలో ముందుకు వెళుతూ నా జీవితాన్ని కృష్ణపరమాత్ముడి సేవకు అంకితం చేస్తాను. నేను చేపట్టిన బాధ్యతలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి’ అని పేర్కొన్నారు. ఉద్యోగాన్ని చేస్తూనే ఆథ్మాత్మిక మార్గంలో నడొచ్చన్న ప్రశ్న ఆమె రిజైన్ గురించి తెలిసిన వారి నోటి నుంచి వినిపిస్తోంది.

ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న విషయం తెలిసినంతనే మీడియా ప్రతినిధులు.. ఆమె నుంచి వివరణ కోరగా ఆమె సూటిగా సమాధానం ఇవ్వకుండా.. చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో అన్ని వివరాలు పేర్కొన్నానని చెప్పారు. కీలక స్థానంలో ఉన్న మహిళా అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేయటం.. అది కూడా అథ్యాత్మిక మార్గంలో నడిచేందుకు వీలుగా అని చెప్పటం ఇప్పుడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.