Begin typing your search above and press return to search.

హ‌రీష్‌రావు ప్రాధాన్యం పెరిగిందే.. అనుచ‌రుడికి ఎమ్మెల్సీ ప‌ద‌వి!

By:  Tupaki Desk   |   31 July 2021 11:39 AM GMT
హ‌రీష్‌రావు ప్రాధాన్యం పెరిగిందే.. అనుచ‌రుడికి ఎమ్మెల్సీ ప‌ద‌వి!
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మే. నిన్న‌లేని ప్రాధాన్యం ఏదో నేడు ద‌క్కొచ్చు. లేదా.. నేడున్న ప్రాధాన్యం రేపు లేకుండా కూడా పోవ‌చ్చు. ఇలాంటి ప‌రిణామాలు రాజ‌కీయాల్లో స‌హ‌జం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి.. తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేన‌ల్లుడి విష‌యంలో చోటు చేసుకుంది. ఆయ నకు తొలి ట‌ర్మ్‌లో ఉన్న ప్రాధాన్యం రెండో ట‌ర్మ్‌లో ఒకింత త‌గ్గింద‌నే వాద‌న ఉంది. ఆదిలో మంత్రి ప‌ద‌వి అస‌లు ఇస్తారా? లేదా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. మంత్రి ప‌ద‌వి ఇచ్చినప్ప టికీ.. హ‌రిష్‌కు ప్రాధ‌న్యం గతంలో క‌న్నా త‌గ్గింద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలే గుస‌గుస‌లాడిన ప‌రిస్థితి ఉంది.

దీనికితోడు దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఆశించిన విధంగా.. ఫ‌లితం రాక‌పోవ‌డంతో.. కేసీఆర్‌.. త‌న మేన‌ల్లుడే అయిన‌ప్ప‌టికీ.. హ‌రీష్‌ను ప‌క్కన పెడుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే.. ఈ ప‌రిణామాలు కొన్నాళ్లుగా స‌ర్దు కుంటున్నాయి. గ‌త కొద్దికాలంగా టీఆర్ఎస్ లో మునుప‌టి ప్రాధాన్యం హ‌రీష్‌కు మ‌ళ్లీ ద‌క్కుతోంది. ప్ర‌ధానంగా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పార్టీకి గుడ్ బై చెప్పాక‌.. హ‌రీష్‌కు ఇంపార్టెన్స్ పెరిగింద‌ని అంటున్నారు. హుజురాబాద్ లో ఉప ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో హ‌రీశ్ రావుకు మునుప‌టి కంటే కూడా కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మంచి గ‌ళం వినిపించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే స‌త్తా ఉన్న నాయ‌కుల్లో హ‌రీష్‌రావు ఒక రు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు రువ్వ‌డంలోనూ హ‌రీష్‌కు హ‌రీషే సాటి. అందుకే.. హుజూ రాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా యి. ఈ క్ర‌మంలోనే హ‌రీశ్ అనుచ‌రుడికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నార‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక శాసనమండలి స్థానం ఖాళీగా ఉన్నాయి. వీటికి ఇప్ప‌టికే ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. క‌రోనా నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వాయిదా వేసింది. అయితే.. క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ త‌న అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నేత‌ల వివ‌రాలు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులోనే మంత్రి హ‌రీశ్ రావు అనుచ‌రుడికి ప‌ద‌వి ఇస్తున్నార‌ని స‌మాచారం.

చట్టసభలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు పెద్దపీట వేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక పద్మశాలి సామాజికవర్గం నుంచి ఇటీవ‌లే టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ రమణ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. హ‌రీశ్ రావు ముఖ్య అనుచ‌రుడైన ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. హ‌రీష్‌కు కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.