Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణకు తేడా చెప్పి మరీ ఉద్యోగులకు హితబోధ చేసిన హరీష్ రావు

By:  Tupaki Desk   |   29 Sep 2022 12:30 PM GMT
ఏపీ, తెలంగాణకు తేడా చెప్పి మరీ ఉద్యోగులకు హితబోధ చేసిన హరీష్ రావు
X
ఏపీ, తెలంగాణ విభజన జరిగినప్పటి నుంచి ఉద్యోగుల మధ్యన సమస్యలు పోలేదు. అప్పట్లో తెలంగాణ ఏర్పడ్డందుకు కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులకు భారీగా జీతాలు ఫిట్మెంట్ పెంచినప్పుడు ఏపీ ఉద్యోగులు గోల చేశారు. చంద్రబాబుపై నాడు ఒత్తిడి తెచ్చారు.దీంతో ఆయన తెలంగాణ అంత కాకున్నా ఏదోలా వారికి కడుపు చల్లబడేలా పెంచారు. ఇప్పటికీ దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ ఉంది.

ఈ క్రమంలోనే ఏపీ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో వారంతా పోరుబాటపడుతున్నారు. ఇప్పటికీ సమస్యలు తీరకపోవడంతో కక్కలేక మింగలేక జగన్ లాంటి మొండిఘటాన్ని ఏమీ అనలేక ఉండిపోతున్నారు.

ఇదే విషయాన్ని తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు లేవదీసి ఏపీ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులకు మధ్య తేడా చెప్పి మరీ ఉద్యోగులకు హితబోధ చేశాడు. మన తెలంగాణ ఉద్యోగులు ఎంతో గొప్ప అని వారికి వివరించారు. జీతాలు, ఫిట్ మెంట్ సహా అన్నింట్లోనూ ఏపీ కంటే మెరుగ్గా ఉన్నట్టు తెలిపారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ఏపీ ప్రభుత్వం ఎంత కర్కశంగా ఉంటుందో తెలంగాణ ఉద్యోగులు గమనించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ఉంటుందని చెప్పారు.

టీచర్లకు గడిచిన 5 ఏళ్లలో 73 శాతం ఫిట్ మెంట్ ను ఇచ్చిందని.. చరిత్రలో ఏ రాష్ట్రం ఇలా ఇవ్వలేదని అన్నారు. ఏపీ ఉద్యోగులతో మాట్లాడితే అసలు విషయాలు తెలుస్తాయని తెలిపారు.

ఇలా ఏపీ కంటే కూడా తెలంగాణ ఉద్యోగులకు ఎంతో చేస్తున్నామని.. వారిని బూచీగా చూపి భయపెట్టే ప్రయత్నాలు చేశాడు మన హరీష్ రావు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.