Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వంపై హైకోర్టులో కాపు నేత పిటిషన్‌!

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:24 AM GMT
జగన్‌ ప్రభుత్వంపై హైకోర్టులో కాపు నేత పిటిషన్‌!
X
కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్రం కేటాయించిన 10% రిజర్వేషన్లలో... కాపులకు 5% కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా జగన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

అయితే హరిరామ జోగయ్య తన పిటిషన్‌ లో ముఖ్యమంత్రి జగన్‌ పేరును ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ కు నంబరు కేటాయించేందుకు నిరాకరించింది.

కాగా జోగయ్య తన పిటిషన్‌ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు.

హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌ రావు విచారణ జరిపారు. పిటిషనర్‌ జోగయ్య తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపించారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పించే వ్యవహారాన్ని వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో న్యాయమూర్తి రఘునందన్‌ రావు స్పందిస్తూ రాజకీయ పార్టీల హామీలను అమలు చేయాలని కోర్టులు ఆదేశించజాలవన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ మ్యానిఫెస్టో అంశాల అమలుకు న్యాయస్థానాలు ఆదేశించలేవన్నారు.

దీంతో హరిరామ జోగయ్య తరపు న్యాయవాది స్పందిస్తూ.. ముఖ్యమంత్రి పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తామని కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... వ్యాజ్యానికి నంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఫిబ్రవరి 7న విచారణ జరగనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.