Begin typing your search above and press return to search.

ముంబై ఇండియన్స్.. హార్దిక్ హృదయాంజలి

By:  Tupaki Desk   |   3 Dec 2021 10:30 AM GMT
ముంబై ఇండియన్స్.. హార్దిక్ హృదయాంజలి
X
హార్దిక్ పాండ్యా .. టీమిండియా హార్డ్ హిట్టర్. నికార్సయిన పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. బౌలింగ్ లో గంటకు 140 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులేయలగడు.. బ్యాటింగ్ లో వంద మీటర్ల సిక్స్లు లూ బాదగలడు. వెన్నుగాయంతో మూడేళ్లుగా దాదాపు బౌలింగ్ చేయకున్నా.. టీమిండియా టి20 జట్టులో చోటు దక్కిందంటేనే, అతడి సామర్థ్యంపై జట్టు యాజమాన్యానికి ఎంతటి నమ్మకమో తెలిసిపోతోంది. హార్డిక్ మళ్లీ బంతి పట్టుకుని బౌలింగ్ చేయగలిగితే టీమిండియాకు అతి పెద్ద ఊరట అనడంలో సందేహమే లేదు.

ముంబై గుర్తించిన మట్టిలో మాణిక్యం

సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు హార్దిక్ పాండ్యా. క్రికెట్ పై ఉన్న అమితాసక్తి తప్ప అతడికెలాంటి ఆస్తి పాస్తుల్లేవు. కనీస చదువూ లేదు. క్రికెట్ మైదానమే అతడి పాఠశాల. అలాంటి హార్దిక్ పాండ్యా కెరీర్ మలుపు తిరిగింది ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ తో. మట్టిలో మాణిక్యాలను పసిగట్టి సరిగ్గా వాడుకోవడంలో ముంబై ముందంజలో ఉంటుంది. అలాంటి వారిలో మొదటివాడు హార్దిక్ అయితే, రెండో వాడు పేసర్ జస్ప్రీత్ బుమ్రా. హార్దిక్ ను వెలుగులోకి తేవడమే కాదు.. అతడు కుదురుకునేందుకు సమయం ఇచ్చింది మంబై. దీని ఫలితమే తొలి రెండు సీజన్లు అంతగా ఆకట్టుకోని హార్దిక్ తర్వాత నిలదొక్కుకున్నాడు. ముంబై జట్టు ఐపీఎల్ లో అద్భుత ప్రయాణం వెనుక హార్దిక్ ఒకడు అనడంలో సందేహం లేదు.

అటు నుంచి టీమిండియాకు..

సహజంగానే ప్రతిభావంతుడైన హార్దిక్ ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణించి టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశం తరఫునా ప్రతిభ చాటి కీలక ఆటగాడిగా ఎదిగాడు. పరిమిత ఓవర్ల (టి20, వన్డేలు) క్రికెట్ కే పనికొస్తాడని అనుకున్నవాడు టెస్టల్లకీ ఎంపికయ్యాడు. 2018 ఇంగ్లండ్ టూర్ లో రాణించి ఓ మ్యాచ్ ను గెలిపించాడు కూడా. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని అందరూ అంచనా వేశారు. అయితే, ఆ వెంటనే జరిగిన ఆసియా కప్ లో వెన్నుగాయానికి గురై ఆటకు దూరమయ్యాడు. అప్పటి నుంచి కెరీర్ లో ఒడిదొడుకులు మొదలయ్యాయి.

రిటైన్ జాబితాలో దక్కని చోటు

హార్దిక్ టీమిండియాకు ఎంపికవుతున్నా అతడికి బౌలింగ్ ఇవ్వడం లేదు. మ్యాచ్ ఫినిషర్ గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కేవలం బ్యాటింగ్ కు పరిమితం చేస్తున్నారు. మరోవైపు గత సీజన్ లో ముంబై తరఫున హార్దిక్ ఐపీఎల్ లో రాణించలేకపోయాడు. ఈ వైఫల్యం ప్రభావం ముంబై నిష్క్రమణకు దారితీసింది. కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి సాధారణ ప్రదర్శన చేసిందా జట్టు. కాగా, ఐపీఎల్ 15వ ఎడిషన్ కోసం ఇటీవల ముంబై ఆటగాళ్ల రిటైనింగ్ జాబితాను ప్రకటించింది. అందులో హార్దిక్ లేడు.

కెప్టెన్ రోహిత్ శర్మ, హార్డ్ హిట్టర్ సూర్యకుమార్, ఆల్ రౌండర్ పొలార్డ్, పేసర్ బుమ్రాలను మాత్రమే అట్టిపెట్టుకుంది. రెండేళ్ల క్రితం నాటి ప్రదర్శన చూస్తే.. హార్దిక్ లేని ముంబైని ఊహించలేం. అయితే, ఇప్పుడా స్థానాన్ని సూర్య దక్కించుకున్నాడు. మరి హార్దిక్ ను ముంబై.. వేలంలో అయినా కొంటుందా? లేదా? అనేది చూడాలి. ఈ నేపథ్యంలోనే ముంబయి ఇండియన్స్‌ ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటుంది అంటూ హార్దిక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది.

ముంబయి ఇండియన్స్‌తో తన జర్నీని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ వీడియో పోస్ట్‌ చేశాడీ ఆల్‌రౌండర్‌.‘ముంబయి ఇండియన్స్‌తో నా ప్రయాణం’ అంటూ వీడియోను పోస్ట్‌ చేసిన హార్దిక్‌.. ‘ఈ జట్టుతో నా ప్రయాణం, జ్ఞాపకాలను జీవితాంతం నాతో పాటు ఉంచుకుంటాను. నేను చేసిన స్నేహాలు, ఏర్పడిన బంధాలు, ప్రజలు, అభిమానులకు నిరంతరం కృతజ్ఞలతో ఉంటాను. మీతో ఉన్నప్పుడు నేను ఒక క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో ఎదిగాను.

నేను యువకుడిగా పెద్ద పెద్ద కలలతో క్రికెట్‌లోకి అడుగుపెట్టాను. మేం కలిసి ఆడాం.. కలిసి పోరాడాం.. కలిసి గెలిచాం.. కలిసి ఓడిపోయాం. ఈ జట్టుతో నేను గడిపిన ప్రతి క్షణానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంత గొప్ప బంధాలకైనా ఎప్పుడో ఒకసారి ముగింపు ఉంటుందంటారు. కానీ ముంబయి ఇండియన్స్‌ నా హృదయంలో నిలిచి ఉంటుంది’ అని భావోద్వేగంతో రాసుకొచ్చాడు.