Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ మరో భారీ షాక్

By:  Tupaki Desk   |   4 Aug 2020 9:30 AM GMT
హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ మరో భారీ షాక్
X
స్థానికులకే ఉద్యోగాల నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ పాలన పట్ల అమెరికా ప్రజల్లో అసంతృప్తే ఎక్కువ కనిపిస్తోంది. ఈ నవంబర్‌లో మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా అగ్రరాజ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. దీంతో ట్రంప్ విదేశీయులకు వరుసగా షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసాల జారీకి సంబంధించి మళ్లీ నిషేధ అస్త్రం ప్రయోగించారు. ఇది ఎక్కువగా భారతీయ ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. హెచ్1బీ వీసాల ద్వారా అమెరికా ఫెడరల్ ఏజెన్సీల్లో చేపట్టబోయే నియామకాలను నిషేధించారు.

హెచ్1బీ వీసాలు సహా వర్కింగ్ వీసాలపై ఈ ఏడాది చివరి వరకు సస్పెండ్ చేస్తూ గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఫెడరల్ ఏజెన్సీల్లో హెచ్1బీ వీసాల ద్వారా జారీ చేసే కాంట్రాక్ట్ నియామకాలను నిషేధించారు. అమెరికన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. కరోనా కారణంగా రెండు నుండి మూడు కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వడంతో పాటు ఎన్నికల్లోను ఇది తమకు ఉపయోగపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు.

ఇది జూలై 24వ తేదీ నుండే అమల్లోకి వచ్చాయి. ఆ రోజు నుండి జారీ చేసే హెచ్1బీ వీసాలన్నింటినికీ ఈ నిషేధం వర్తిస్తుంది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏజెన్సీల నుండి కాంట్రాక్టులు దక్కించుకునే ఐటీ సంస్థల్లో భారతీయ టెక్కీలు ఉంటారు. ఈ ఆదేశాలతో ఆ కంపెనీలు హెచ్1బీ వీసాల నియామకాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. హైర్ అమెరికన్ అనే కారణంతోనే తాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేశానని, తక్కువ వేతనం ఇవ్వవచ్చుననే కారణంతో అమెరికన్లను తొలగించి విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తాను వ్యతిరేకమన్నారు. అమెరికన్లకు నష్టం చేసే ఏ చర్యలను సమర్థించేది లేదన్నారు.