Begin typing your search above and press return to search.

కాశీ జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో 'శివ లింగం'.. కోర్టు సంచలన ఆదేశాలు

By:  Tupaki Desk   |   16 May 2022 1:27 PM GMT
కాశీ జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో శివ లింగం.. కోర్టు సంచలన ఆదేశాలు
X
అనుకున్నట్టే అయ్యింది. మసీదులో పురాతన శివలింగం ఉన్నట్టే నివేదిక సిద్ధమైంది. ప్రఖ్యాత జ్ఞాన్ వాపి మసీదు సముదాయం వద్ద చివరి రోజు సర్వే సందర్భంగా 'శివ లింగం' కనిపించిందని.. ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు సోమవారం జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఆ ప్రాంతానికి ఎవరినీ ప్రవేశించేందుకు అనుమతివ్వద్దని స్పష్టం చేసింది.

సీల్డ్ ఏరియా భద్రతకు డీఎం, పోలీస్ కమిషనర్, పోలీస్ కమిషనరేట్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ వారణాసి బాధ్యత వమిస్తారని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో హిందూ పిటీషనర్ అయిన సోహన్ లాల్ ఆర్య , సర్వే కమిటీ కాంప్లెక్స్ వద్ద శివలింగాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు.

మసీదు సర్వే కోసం కోర్టు కమిషన్ తోపాటు వచ్చిన ఆర్య, తమకు ఆధారాలు దొరికాయని పేర్కొన్నారు. శివలింగం కనిపించిందని.. ఎవరికోసమైతే నంది ఇప్పటివరకూ ఎదురుచూస్తున్నాడో ఆయనే దర్శనమిచ్చాడని తెలిపారు. విషయాలు స్పష్టంగా తెలియగానే మసీదు ప్రాంగణంలో 'హర్ హర్ మహాదేవ్' కీర్తనలు ప్రతిధ్వనిస్తాయి అని కమిషన్ సభ్యుడు లాల్ ఆర్య తెలిపారు.

బుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానవాపిలో బాబా మహదేవ్ (శివలింగం) ఉన్నట్లు తేలడం సనాతన హిందువులకు శుభ సూచికమని.. పురాణ సందేశాన్నిచ్చిందని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఈ మసీదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది.

శివుడి లింగం గుర్తించిన ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా చూసుకోవాలని వారణాసి జిల్లా కోర్టు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్పష్టం చేసింది. సీల్ చేసిన ప్రాంత భద్రతకు బాధ్యత వహించాలన్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

-అసలు వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదం ఏంటి?
మొగల్ చక్రవర్తుల కాలంలో ఔరంగజేబు పాలనలో జ్ఞానవాపి శివాలయాన్ని కూల్చేసి అక్కడ మసీదును నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే ఇందుకు అనుగుణంగానే మసీదు వెనుకాల దేవాలయానికి సంబంధించిన స్తంభాలు ఉండడంతో హిందువుల దేవాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని ఆరోపిస్తున్నారు. కొన్ని హిందూ సంస్థలు మసీదును హిందువులకు అప్పగించాలని కోరుతున్నారు.

అంతకుముందు ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదు వెలుపల గోడపై హిందూ దేవతల విగ్రహాలున్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. కోర్టు కలుగజేసుకొని దీనిపై వీడియోగ్రఫీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేవించింది. దీంట్లో భాగంగానే సర్వేను కొనసాగించాలని వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఈ సర్వే ప్రకారం ఇది హిందువులకు చెందుతుందా? మసీదుగానే పరిగణిస్తారా? అన్నది వేచిచూడాలి.