పోలీసుల్ని కదిలించిన ఆమె మరణం..

Wed Sep 11 2019 11:00:30 GMT+0530 (IST)

Guntur cops bid final farewell to woman who served them for 40 yrs

పోలీసులది రాతి గుండె అని.. వారికి భావోద్వేగాలు అసలే ఉండవని చాలామంది చాలా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తుంటారు. కానీ.. వారు సైతం మనుషులేనన్న విషయాన్ని వారు తమ చేతలతో చాలాసార్లు చెప్పేస్తున్నా.. ఆ విషయాన్ని పట్టించుకున్నోళ్లు కనిపించరు. తాజాగా ఉదంతం చూస్తే.. పోలీసుల్లో ఇలాంటి కోణం కూడానా? అన్న భావన కలగటం ఖాయం. పోలీసుల్లోని మరో కోణాన్ని చాటే ఈ ఉదంతంలోకి వెలితే.. కృష్ణా జిల్లా తాడేపల్లికి చెందిన మూగమ్మ వయసు 80 ఏళ్లు. మాటలు రాని ఆమె అంటే తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేసే ప్రతిఒక్కరికి గౌరవమే కాదు.. ఆమెను అమ్మకాని అమ్మగా భావిస్తారు. ఇంతకీ ఆమె అసలు పేరు బాణావత్. మాటలు రాకపోవటంతో ఆమెను అంతా మూగమ్మ అని పిలుస్తారు. దాదాపు పాతికేళ్ల క్రితం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు ఆమె చేరుకున్నారు.

ఎవరూ లేని ఆమెను అక్కడి పోలీసులు జాలితో ఆదుకున్నారు. అప్పటి నుంచి ఆమె స్టేషన్లోనే ఉండేది. ఒకసారి మహిళా నిందితురాలిని తనిఖీ చేసే విషయంలో మహిళా పోలీసులు ఎవరూ లేకపోవటంతో.. ఏం చేయాలా? అని కిందామీదా పడుతున్న వేళ.. పోలీసుల అవస్థల్ని చూసి.. సదరు మహిళను తనిఖీ చేయటమే కాదు.. నిందితురాలి దగ్గర చోరీ సొత్తు రూ.లక్షను గుర్తించటంలో కీలకంగా వ్యవహరించారు.

అప్పటి నుంచి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మహిళా నిందితురాలకు సంబంధించిన విషయాల్ని ఆమె చూసే వారు. అంతేకాదు.. స్టేషన్లో పని చేసే అధికారులు.. కానిస్టేబుళ్లను తల్లిలా సాకేవారు. వారి అవసరాల్ని చూసుకునే వారు. అలాంటి ఆమె.. తాజాగా చనిపోయారు. మూగమ్మ మరణం తాడేపల్లి పోలీసుల్ని కదిలించటమే కాదు.. ఈ స్టేషన్లో గడిచిన పాతికేళ్లుగా పని చేసిన అధికారులు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ.. తాజాగా మూగమ్మ మరణం గురించి తెలిసింతనే వారిలో పలువురు సెలవులు పెట్టి మరీ తాడేపల్లికి వచ్చి.. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనటం విశేషం.

అంత్యక్రియల సందర్భంగా పలువురు పోలీసులు ఆమె పాడె మోస్తే.. మరికొందరు ఆమె అంత్యక్రియలకు అవసరమైన ఖర్చును భరించారు. అయినోళ్లను తమ స్వార్థం కోసం హతమార్చే దరిద్రపు రోజుల్లో.. అమ్మ కాని అమ్మలా తమను ఆదరించిన మూగమ్మ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పలువురిని ప్రశంసించేలా చేసింది.