Begin typing your search above and press return to search.

గుబులు పుట్టిస్తున్న గులాబ్.. రెండు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎంత?

By:  Tupaki Desk   |   26 Sep 2021 4:41 AM GMT
గుబులు పుట్టిస్తున్న గులాబ్.. రెండు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎంత?
X
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన సంగతి తెలిసిందే. కళింగపట్నానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ తుపాను ఈ సాయంత్రం (ఆదివారం) గోపాల్ పుర్.. కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తుపాన్ కు ''గులాబ్'' అని పేరు పెట్టారు. దీని కారణంగా ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు 'ఆరెంజ్' హెచ్చరికల్ని జారీ చేశారు. దీని కారణంగా శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖపట్నం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని.. మిగిలిన కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి.

వచ్చే 24 గంటల వ్యవధిలో ఏపీతో పాటు ఒడిశా.. తెలంగాణ.. విదర్భ.. ఛత్తీస్ గఢ్ లలోభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే వేళలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పరిసర ప్రాంతాల్లో కచ్చా ఇళ్లతో పాటు పూరిళ్లు కూడా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

తాజా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కారు ముందస్తు జాగ్రత్తల్ని చేపట్టింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను అలెర్టు చేశారు. లోతట్టుప్రాంతాల్లో నివసిస్తున్న 86వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర వినియోగానికి వీలుగా 16 శాటిలైట్ ఫోన్లు.. వీశాట్.. డీఎంఆర్ సమాచార పరికరాల్ని ఆయా ప్రాంతాలకు తరలించారు. కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ నిల్వలలతో పాటు ఇతర అత్యవసర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు విపత్తు నివారణ సిబ్బందిని సమాయుత్తం చేశారు.

తుపాను ప్రభావం ఇప్పటికే తెలంగాణ మీద పడింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.3.. కరీంనగర్ జిల్లాలోని పోచంపల్లిలో 6 సెంటీమీటర్లతో పాటు వివిధ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. గులాబ్ ప్రభావంతో ఈ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.