Begin typing your search above and press return to search.

మోడీకి సవాల్ గా మారిన గుజరాత్ ఎన్నికలు?

By:  Tupaki Desk   |   25 Sep 2021 12:30 AM GMT
మోడీకి సవాల్ గా మారిన గుజరాత్ ఎన్నికలు?
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మోదీకి సవాల్ గా మారాయి. గత 20 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ విజయం సాధిస్తూ వస్తోంది. ఇందులో నాలుగు సార్లు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో గుజరాత్ ను రోల్ మోడల్ గా తీర్చి దిద్దారు. మోదీ గుజరాత్ లో చేసిన అభివృద్ధిని చూసి ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి అవకాశం వచ్చిందన్నది కమలనాథుల నమ్మకం. అయితే మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత గుజరాత్ లో బీజేపీయే విజయం సాధిస్తోంది. అయితే ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం మోదీ సత్తాను పరీక్ష పెట్టనున్నాయి.

గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలున్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 66 స్థానాలను దక్కించుకుంది. అంటే బీజేపీకి కాంగ్రెస్ గట్టపోటీనిచ్చింది. అయితే ఆ తరువాత ఆపరేషన్ ఆకర్స్ పేరిట కాంగ్రెస్ నాయకులను బీజేపీలోకి తెచ్చుకున్నారు. గత ఐదేళ్లలో బీజేపీ పాలనకు ఎక్కడా రిమార్క్ రాకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొవిడ్ ను అదుపు చేయడంలో విఫలం కావడం.. పటీదార్లు మరోసారి నిరసన గళమెత్తెందుకు రెడీ అవడంతో బీజేపీ అప్రమత్తమయింది. దీంతో పటీదార్లకు చెందిన భూపేంద్ర పటేల్ ను ఇటీవల ముఖ్యమంత్రిని చేసింది.

ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో పట్టు నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న గుజరాత్ లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నాయకులు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కీలక నేత రాహుల్ ఇప్పటికే ప్రణాళికను వేస్తున్నారు. బీజేపీ వైపు అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. సీపీఎం యువ నేత కన్నయ్య త్వరలో కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే ఇండిపెండెంట్ గా గెలిచిన జిగ్నేష్ ను సైతం పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఇద్దరు పార్టీలో చేరితే అదనపు బలం చేకూరే అవకాశం ఉందన పార్టీ భావిస్తోంది.

పటీదార్లు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ నేత నమ్ముతోంది. ఎందుకంటే పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్థిక్ పటేల్ మరోసారి పటీదార్ల ఉద్యమం లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున్న ఆందోళన జరిగిన సమయంలో హార్థిక్ పటేల్ ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆధ్వర్యంలో యువ నేతలను కలుపుకుపోయేందుకు రెడీ అవుతున్నారు. రాహుల్ గాంధీ సైతం సమయం చూసుకొని రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

అటు బీజేపీ సైతం ఈసారీ ముఖ్యమంత్రి సీటును చేజార్జుకోకుండా సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రినే మార్చేశారు. పటీదార్ల నుంచి వ్యతిరేకత వస్తుందని గుర్తించి ఆ వర్గానికి చెందిన ముఖ్యమంత్రిని నియమించారు. మరోవైపు మోదీ ఇమేజ్ ను మరోసారి ఉపయోగించుకొని ఎన్నికల్లో దిగనున్నారు. రాష్ట్రంలో ఎలాగైనా గెలిచేందుకే ఇప్పటి నుంచే తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లు పార్లమెంట్ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. అందువల్ల స్వయంగా మోదీ-షా స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది.

బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారే తమదైన శైలిలో గుజరాత్ లో గెలిచేందుకు వ్యూహం పన్నుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. హోరా హోరీగా జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చివరికి బీజేపీ పాత సీన్ నే రిపీట్ చేస్తుందా..? లేక బీజేపీ కంచుకోటను కాంగ్రెస్ బద్దలు కొడుతుందా..? అని చర్చించుకుంటున్నారు.