Begin typing your search above and press return to search.

మాల్స్.. రెస్టారెంట్లకు గైడ్ లైన్స్ వచ్చేశాయ్

By:  Tupaki Desk   |   5 Jun 2020 5:14 AM GMT
మాల్స్.. రెస్టారెంట్లకు గైడ్ లైన్స్ వచ్చేశాయ్
X
లాక్ డౌన్ నేపథ్యంలో యావత్ దేశం స్తంభించిన సంగతి తెలిసిందే. ఎవరింట్లో వారు ఉండిపోయిన రోజుల నుంచి ఈ మధ్యనే అమల్లోకి వచ్చిన సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొన్ని షాపులు.. వాణిజ్య సంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ నెల ఎనిమిది నుంచి మరిన్ని సడలింపులు అమల్లోకి రానున్నాయి. రెండున్నర నెలలుగా అందుబాటులో లేని షాపింగ్ మాల్స్.. రెస్టారెంట్లు తెరుచుకోనున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేశారు.

మాల్స్.. రెస్టారెంట్లను తెరవనున్న నేపథ్యంలో ఏయే అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు. సాధారణంగా షాపింగ్ మాల్స్.. రెస్టారెంట్లలో రద్దీగా ఉండటమే కాదు.. పెద్ద ఎత్తున రాకపోకలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో భౌతికదూరంతో పాటు.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. షాపింగ్ మాల్స్.. రెస్టారెంట్లలో అనుసరించాల్సిన అంశాల్ని చూస్తే..

% భౌతిక దూరం తప్పనిసరి.
% మాస్కుల్ని పెట్టుకోవటం ప్రతి ఒక్కరు చేయాలి.
% శానిటైజర్లను అందరికి అందుబాటులో ఉంచాలి
% రద్దీ లేకుండా పరిసరాలు చూసుకోవాలి.
% వినియోగదారులు.. సిబ్బంది తుమ్మినప్పుడు.. దగ్గినప్పుడు తప్పనిసరిగా చేతి రుమాలు కానీ టిష్యూను కానీ అడ్డుపెట్టుకోవాలి. మాస్కు ఉంటే ఇబ్బంది లేదు.
% బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయటం నిషిద్ధం
% వ్యాలెట్ పార్కింగ్ వసతి ఉంటే.. వాహనాల్ని తీసుకెళ్లే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు.. గ్లౌజ్.. ఫేస్ షీల్డ్ ధరించాల్సి ఉంటుంది.
% కారు తాళం చెవులు.. స్టీరింగ్.. గేర్ మీద డిస్ ఇన్పెక్షన్ స్ప్రే చేయాల్సిందే
% మాల్స్ లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారుల్ని అనుమతించాల్సి ఉంటుంది
% పరిమితి దాటిన తర్వాత.. బయలకు వెళ్లే వారికి తగ్గట్లుగా.. లోపలకు అనుమతించాలి
% ఏసీల వినయోగంలో కేంద్ర మార్గదర్శకాలకు తగ్గట్లే టెంపరేచర్ ను 24-30 డిగ్రీల మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
% గాలిలో తేమ శాతం 40-70 మధ్య ఉండేలా చూడాలి.
% రెస్టారెంట్లలో సీటింగ్ సామర్థ్యంలో 50 మందినే అనుమతించాలి. భౌతికదూరం తప్పనిసరి.
% డిజిటల్ పేమెంట్ కు ప్రాధాన్యమివ్వాలి.
% వినియోగదారులు వెళ్లగానే.. మరొకరు వచ్చి కూర్చునేలోపు టేబుళ్లు.. కుర్చీల్ని శానిటైజ్ చేయటం తప్పనిసరి.
% గేమింగ్ జోన్లను మూసివేయాలి
% షాపింగ్ మాల్ లో ఉన్నంతసేపు మాస్కులతోనే ఉండాలి.
% ఏదైనా వస్తువును చేత్తో తాకే అవకాశం ఉంటే.. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సిందే.
% మాల్స్ లోకి కానీ రెస్టారెంట్లలో కానీ థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి.
% ఒక్కక్కరి మధ్య కనీసం ఆరు మీటర్ల సామాజిక దూరం ఉండేలా జాగ్రత్తలు అవసరం.
% అదనపు సిబ్బంది అవసరం అనుకుంటే.. మాల్స్.. హోటల్ యాజమాన్యాలు తప్పనిసరిగా నియమించుకోవాలి.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా? అన్నది గమనించిన తర్వాత కూడా ముప్పు అంతో ఇంతో ఉంటుంది కదా? అన్న సందేహం వచ్చిందా? అలాంటి ఆలోచనలు ఉంటే.. ఇటీవల కాలంలో ఉన్నట్లే ఇంటికే పరిమితమైతే సరిపోతుంది. బయటకు వెళ్లి..రిస్క్ పడే కన్నా.. ఇంట్లోనే ఉంటూ.. ఆఫీసు పని చేసుకుంటూ పరిమితమైన ప్రపంచంలో ఉంటే.. అంతకు మించిన మంచి పని మరొకటి ఉండదని చెప్పక తప్పదు.