Begin typing your search above and press return to search.

వన్ అండ్ ఓన్లీ : గుడివాడా...ఇదేమి గడబిడ...?

By:  Tupaki Desk   |   14 May 2022 1:30 AM GMT
వన్ అండ్ ఓన్లీ :  గుడివాడా...ఇదేమి గడబిడ...?
X
ఆయన తానుగా సూపర్ పొలిటీషియన్ అని అనుకుంటున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఆయన జస్ట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడే ఒక రేంజిలో జోరు చేశారు. ఇపుడు ఏకంగా మినిస్టర్ అయిపోయారు. అంతే స్పీడ్ బాగా పెరిగింది. నేనంటే నేనే అని అంటున్నారు. నా పక్కన ఎవరికీ చోటు లేనే లేదు అని అంటున్నారు. ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాధ్. ఆయన ఎమ్మెల్యేగా మూడేళ్ళ నుంచి ఉన్నారు. ఆ టైమ్ లో అనకాపల్లి జిల్లాలో ఆయనకు సొంత పార్టీలోనే మరొకరితో పడదు అని ప్రచారం సాగింది.

అనకాపల్లి ఎంపీగా ఉన్న భీసెట్టి సత్యవతి సౌమ్యురాలు, వృత్తి రిత్యా ఆమె డాక్టర్. అంతే కాదు సంఘ సేవకురాలు. ఆమెతో గుడివాడకు పెద్దగా పొసగదు అంటారు. ఇక సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుని అనకాపల్లి రాజకీయాల్లో ఏనాడో పక్కన పెట్టేశారు అని కూడా చెబుతారు. దీంతో పాటు జిల్లాలో ఉన్నమరో సీనియర్ ఎమ్మెల్యే, పాయకరావుపేటకు చెందిన గొల్లబాబూరావు ఇలాకాలో కూడా తలదూర్చి అక్కడ సొంత పార్టీలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గాన్ని తయారు చేశారు అని అంటారు. గొల్ల బాబూరావు వర్గీయులు దీని మీద గుస్సా కావడమే కాదు, ఏకంగా మీడియాకు ఎక్కారు.

తనకు మంత్రి పదవి రానందుకు బాధ కంటే గుడివాడకు ఇచ్చినందుకే ఆ మధ్యన గొల్ల బాబూరావు మీడియాకు ఎక్కాల్సి వచ్చిందని అంటారు. మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా గుడివాడ సఖ్యత గా ఉన్నట్లుగా కనిపించరు అని చెబుతారు. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా అనకాపల్లి గౌరీ పరమేశ్వరుల నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ సత్యవతిని కూడా ఆహ్వానించారు. గుడివాడతో పాటు ఆమె ఫోటో వేసి కరపత్రాలు ప్రచురించారు.

వాటిని చూసిన మంత్రి గారు ఎంపీ ఫోటో తీస్తేనే తప్ప తాను ఆ కార్యక్రమానికి హాజరు కాను అని ఆలయ కమిటీకి షరతు పెట్టారు. చేసేది లేక వారు ఎంపీ ఫోటోలు తీసేసి మరో ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి కొత్తగా కరపత్రాలను ప్రింట్ చేయించారు. దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఎంపీ అయితే ఎవరు, ఆమె టీడీపీ మనిషి కాదు కదా. పైగా ప్రజల నుంచి ఎన్నికైన సొంత పార్టీ ఎంపీ. అలాంటి ఎంపీ ఫోటోను తీయించడమేంటి అని అంటున్నారు.

వైసీపీ ఎంపీతో పడకపోతే జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు మంత్రి గారు అని కూడా అంటున్నారు. మొత్తానికి ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువ మంత్రి ఈ విధంగా దుందుడుకు చర్యలతో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకుంటున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. పదవులు వచ్చినపుడే ఒదిగి ఉండాలని వైసీపీలో పెద్దలు సూచిస్తున్నారు. మరి గుడివాడ వింటారా. ఏమో చూడాలి.