Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: ఏలూరులో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   20 March 2019 8:56 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: ఏలూరులో గెలుపెవరిది?
X
పార్లమెంట్ నియోజకవర్గం : ఏలూరు
టీడీపీ : మాగంటి బాబు
వైసీపీ : కోటగిరి శ్రీధర్
జనసేన : పెంటపాటి పుల్లారావు

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకూ టీడీపీకి అనుకూలంగా ఉన్న ఇక్కడి పరిస్థితులు ఇప్పుడు 2019 ఎన్నికల వేళ అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఏలూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగంటి బాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ పొందిన అభ్యర్థి కోటగిరి శ్రీధర్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.. గత కొన్నేళ్లుగా ఏలూరులో సీనియర్లకే ఎంపీగా పట్టం కడుతోన్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో యువ కిశోరాన్ని గెలిపించుకోవాలని తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. మరి సీనియర్ వర్సెస్ జూనియర్ గా సాగుతున్న ఏలూరు సమరంలో గెలుపు ఎవరిదనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

*ఏలూరులో మాగంటి వర్సెస్ శ్రీధర్

పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబుకు చంద్రబాబు టికెట్ ఖాయం చేశాడు. ఇక వైసీపీ తరుఫున దివంగత మాజీ మంత్రి కోటగిరి విధ్యాదరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ బరిలో ఉన్నారు. ఏలూరు ఎంపీ స్థానం రాజకీయాల్లోనే ప్రత్యేకమైనది.. అటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ.. ఇటు కృష్ణా జిల్లాలోనూ ప్రాధాన్యం కలిగిన ఈ ఎంపీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.

*మాగంటికి ప్లస్ ఏంటి.? మైనస్ ఏంటి.?

ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి బాబుకు నియోజకవర్గంలో మంచి పేరుంది. ప్రజలకు అందుబాటులో ఉండడం.. ఈ నియోజకవర్గ పరిధిలో టీడీపీ బలంగా ఉండడం ఆయనకు కలిసి వస్తోంది. అయితే ఆర్థికంగా అంత ఖర్చు పెట్టే స్థితిలో లేరనే ప్రచారం జరుగుతోంది. ఏ పనినైనా సాధిస్తారనే పేరు తెచ్చుకున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను వైభవంగా పండుగలా చేస్తుంటారు. అయితే గడిచిన ఐదేళ్లలో మాగంటిపై చాలా ఆరోపణలు వచ్చాయి. కైకలూరులో పేకాట నిర్వహించినట్టు..అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. రాష్ట్రమంతా వైసీపీకి అనుకూల గాలి వీస్తుండడంతో ఆ గాలిలో ఇన్ని ఆరోపణలు , టీడీపీ వ్యతిరేకత మాగంటి కొంప ముంచేలా కనిపిస్తోందంటున్నారు.

*కోటగిరి శ్రీధర్ గెలుపు నల్లేరుపై నడకేనా?

ఉమ్మడి రాష్ట్రంలోనే కోటగిరి విధ్యాధరరావు మంత్రిగా.. రాష్ట్ర నేతగా తనదైన ముద్రవేశారు. ఇప్పుడు శ్రీధర్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అభివృద్ధి చేయాల్సిన పనులను ఓ జాబితాలో తయారు చేసుకొని ప్రజలకు వివరిస్తున్నారు. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్తున్న శ్రీధర్ ను ఇక్కడి ప్రజలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి సామాజికవర్గాన్ని ఈయన కలుస్తున్నారు. వారి డిమాండ్లను రికార్డు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు కలిగే లబ్ధిని వివరిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రజల సైతం కోటగిరి వైపు మొగ్గుచూపుతున్నట్టు గ్రౌండ్ రిపోర్టులో తేలింది.

*జనసేన ఏలూరు ఎంపీగా పెంటపాటి పుల్లారావు

ఇక వీరిద్దరితోపాటు ఏలూరు నుంచి ఎంపీగా సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విదేశాల్లో చదువుకున్న పుల్లారావు.. ఏలూరు పరిధిలోని పోలవరం నిర్వాసితుల కోసం ఎంతో పోరాటం చేశారు.ముఖ్యంగా గిరిజనులకు అండగా నిలబడ్డారు. సగటు మధ్యతరగతి వ్యక్తి కావడం.. రాజకీయ విలువలుండడంతో ఈయన జనసేన తరుఫున ఓట్లు చీల్చే వ్యక్తిగా మారారు.

*అంతిమంగా శ్రీధర్ కే చాన్స్

ఏలూరు పరిధిలో ఏడు నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నాయి. వీటిలో పోలవరం, నూజివీడులో వైసీపీకి ఈసారి మంచి మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఉంగటూరులోనూ వైసీపీ ఆధిక్యత కనపడుతోంది. దెందులూరులో టీడీపీకి ఫాలోయింగ్ ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడ ప్రభాకర్ సామాజికవర్గానికే చెందిన వైసీపీ యూరప్, యూకే కన్వీనర్ కొఠారు అబ్బాయి చౌదరి రంగంలో ఉండడంతో ఈసారి ప్రభాకర్ ఓడిపోతాడన్న చర్చ సాగుతోంది. ఏలూరులో టీడీపీ బలంగా ఉన్న జనసేన ప్రభావం కూడా టీడీపీకి గట్టిగా ఉండి ఓట్లు చీల్చుతుంది. ఇది పరోక్షంగా కాపు ఓట్లు చీల్చి వైసీపీకి ప్లస్ అవుతుందని.. కోటగిరి శ్రీధర్ గెలుపు గ్యారెంటీ అన్న అంచనాలు నెలకొన్నాయి.