Begin typing your search above and press return to search.

అమెరికా వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ .. కానీ, వాటిపై నో క్లారిటీ !

By:  Tupaki Desk   |   23 Sep 2021 8:30 AM GMT
అమెరికా వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ .. కానీ, వాటిపై నో క్లారిటీ !
X
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత నుండి దాదాపుగా 18 నెలలుగా 33 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. రెండు డోసుల టీకా వేయించుకున్నవారు నవంబరు నుంచి అమెరికాకు రావొచ్చని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కొన్ని విషయాలను మాత్రం ఎటూ తేల్చకుండా వదిలేసింది. భారత్, చైనా, బ్రేజిల్ సహా 33 దేశాలకు చెందిన ప్రయాణికులు ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారో వారు అమెరికా కి వెళ్ళవచ్చు.

అయితే, అమెరికాకు బయల్దేరడానికి ముందు మూడు రోజులలోపు కరోనా పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ రిపోర్ట్‌ కలిగి ఉండాలి. అలాగే అన్ని దేశాల నుండి వచ్చిన విదేశీ పౌరులు కొన్ని మినహాయింపులతో అమెరికా విమానంలో ప్రయాణించడానికి టీకాలు తప్పనిసరి. ఈ విషయంపై అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) త్వరలో నిర్ణయం తీసుకోనుంది. బహుశా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదం పొందిన టీకాలతో పాటు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్న ప్రయాణికులకు అనుమతి ఉండొచ్చని సీడీసీ అధికార ప్రతినిధి క్రిస్టెన్ నార్ద్‌ లుండ్ వెల్లడించారు.

ఇక మన దేశంలో తయారైన కొవాగ్జిన్‌ కు, చైనాలో తయారైన టీకాలకు అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర అనుమతులు లేవు. కాబట్టి ఈ టీకాలు వేయించుకున్నవారిని అనుమతించాలా, వద్దా అనే విషయంపై సీడీసీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వ్యాక్సిన్ రూల్స్ విషయంలో ప్రయాణికులు అయోమయానికి గురికాకుండా కచ్చితమైన సమాచారాన్ని ఎయిర్‌ లైన్స్ అందివ్వాలి. ప్రస్తుతం ఎయిర్‌ లైన్లు కేవలం కరోనా నెగెటివ్ రిపోర్టు మాత్రమే తనిఖీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత సీడీసీ ఆదేశాలను అనుసరించి అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-మెయిల్, ఫోన్ ద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

టీకాలు వేసుకోకుండా విదేశాల నుంచి వచ్చే అమెరికన్లకు వ్యాక్సిన్ తీసుకున్న వారికంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలుస్తోంది. ఇలాంటి వారు 24 గంటలలోపు టెస్టు చేయించుకున్న నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అలాగే స్వదేశానికి చేరుకున్న తర్వాత మరో వైరల్ టెస్టు ఉంటుంది. ఇక వ్యాక్సి తీసుకున్న అమెరికన్ పౌరులు అమెరికాకు బయల్దేరడానికి ముందు మూడు రోజులలోపు కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్‌ సర్టిఫికేట్ చూపించాలి. మానవత కోణంలో టీకాలు తీసుకోని విదేశీయులను అనుమతించే విషయమై జో బైడెన్ సర్కార్ ఆలోచన చేస్తుంది. అయితే, అలాంటి వారు అమెరికా వచ్చిన తర్వాత తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి