Begin typing your search above and press return to search.

గ్రీన్ టీ తాగితే ఆ కొవ్వు 75 శాతం క‌రుగుతుంద‌ట‌!

By:  Tupaki Desk   |   19 Feb 2020 12:16 PM GMT
గ్రీన్ టీ తాగితే ఆ కొవ్వు 75 శాతం క‌రుగుతుంద‌ట‌!
X
ఈ మ‌ధ్య కాలంలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య పెరిగిపోతోంది. గ్రీన్ టీ వల్ల అనేక లాభాలున్నాయని, క్యాన్సర్ ప్రమాదంతో పాటు బరువును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ వల్ల ఏకాగ్రత మెరుగవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర టీలలా గ్రీన్ టీ ఆక్సిడేషన్ ప్రక్రియకి గురవ్వదు కాబ‌ట్టే మరింత ఆరోగ్యకరం. గ్రీన్ టీలో ఉండే శక్తివంతమైన లక్షణాలు శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ ,ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తాయి. అందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, పాలీఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు మాన‌వ శ‌రీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, జ్వరం నుండి దూరంగా ఉంచుతాయి. వీట‌న్నింటితో పాటు గ్రీన్ టీ వ‌ల్ల లివ‌ర్‌లోని కొవ్వు క‌రిగిపోతుంద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

మ‌న శరీరంలో కాలేయం అత్యంత కీల‌క‌మైన భాగాల‌లో ఒక‌టి. మ‌నిషి ఆరోగ్యంపై కాలేయం ప‌నితీరు ఎంతో ప్ర‌భావం చూపుతుంది. అందుకే, కాలేయాన్ని జాగ్ర‌త్తాగా కాపాడుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే, మారుతున్న ఆహార‌పు అల‌వాట్లు, జంక్ ఫుడ్ కార‌ణంగా కాలేయ సంబంధిత వ్యాధులు, కాలేయంలో కొవ్వు పెరిగిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌య్యాయి. అయితే, ఆహారంలో మార్పుల ద్వారా మాత్ర‌మే కాలేయంలో కొవ్వును కరిగించ‌వ‌చ్చ‌న్న భావ‌న ఉంది. అయితే, ప్ర‌తిరోజు వ్యాయామం చేయ‌డంతోపాటు గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల కాలేయంలోని కొవ్వు 75 శాతం త‌గ్గుతుంద‌ని వెల్ల‌డైంది.

అయితే, గ్రీన్ టీ పదార్థాలతో కూడిన ఆహార సప్లిమెంట్లపై చేసిన అధ్యయనంలో గ్రీన్ టీని ఖాళీ కడుపుపై తాగితే, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తేలింది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనే సమ్మేళనాల వలన గ్రీన్ టీ ఎంత తాగుతున్నారన్నది గమనిస్తూ ఉండాలి. కాటెచిన్స్ అధిక మొత్తంలో ఉంటే కాలేయం పాడవుతుందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.