Begin typing your search above and press return to search.

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణలో ఎక్కడి వారు అక్కడే!

By:  Tupaki Desk   |   16 Aug 2022 4:33 AM GMT
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణలో ఎక్కడి వారు అక్కడే!
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకోనుంది. సరిగ్గా ఉదయం 11.30 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా ఒక్క నిమిషం పాటు ఎవరికి వారు ఎక్కడికక్కడే నిలబడిపోతారు. అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక్కసారి 11.30 గంటలకు పడిపోతాయి. నిమిషం పాటు రోడ్డు మీద అందరూ అలా నిలబడిపోయే పరిస్థితి. ఈ నిమిషంలో జాతీయ గీతాలాపన చేస్తారు. ఇంత భారీగా నిర్వహించే ఈ కార్యక్రమం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా ఉదయం 11.30 గంటలకు ఎక్కడివారు అక్కడే నిలబడిపోయి ఒక నిమిషం పాటు కూర్చుండిపోయేలా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆ సమయానికి రోడ్ల మీద ఉన్న వారు ఎవరికి వారు అంటే.. టూ వీలర్ మీద వారు.. కార్లలో ప్రయాణించేవారు.. బస్సులు.. ఆటోలు.. ఇలా రోడ్డు మీద ప్రయాణించే వారు ఎవరైనా ఆగిపోవాల్సి ఉంటుంది. నిమిషం పాటు అన్ని కూడళ్ల వద్దసిగ్నల్స్ లో అన్ని వైపులా రెడ్ సిగ్నల్స్ వేసేస్తారు.

హైదరాబాద్ మహానగరంతోపాటు తెలంగాణలోని అన్ని నగరాలు.. పట్టణాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వీలుగా అబిడ్స్ జీపీవో కూడలి వద్ద ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. నగర పోలీసులు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నెక్లెస్ కూడలి ప్రాంతంలో జరిగే ఈ ప్రోగ్రాంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. పోలీసులు.. రెవెన్యూ అధికారులు ఇలా ఎవరికి వారు.. వారి వారి ప్రాంతాల్లో నిర్వహించే మహా గీతాలాపనలో పాల్గొనబోతున్నారు. దీంతో ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఒక అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది.