Begin typing your search above and press return to search.

ఇలాంటి వాలంటీర్ల సంగతి చూడాల్సిందే జగన్

By:  Tupaki Desk   |   5 April 2020 6:24 AM GMT
ఇలాంటి వాలంటీర్ల సంగతి చూడాల్సిందే జగన్
X
ప్రజలకు సేవ చేసే విషయంలో చిత్తశుద్ధి ఉన్నా.. కొందరు చేసే చేష్టలతో ప్రభుత్వానికి వచ్చే చెడ్డపేరు అంతా ఇంతా కాదు. ఇలాంటి వాటి విషయాల్లో ప్రభుత్వాలు కఠినంగా ఉండటంతో పాటు.. ప్రభుత్వం మీద భరోసా పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా గుంటూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటనను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. కరోనా వేళ.. ప్రభుత్వం వెయ్యి రూపాయిల ఆర్థిక సాయాన్ని ఇస్తానని ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే అయినప్పటికీ.. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సాయం చేయటానికి సిద్ధమైంది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ఇస్తానన్న సాయాన్ని ఎప్పుడిస్తారంటూ అడిగిన యువకుడిపై గ్రామ వాలంటీర్లు దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. లాక్ డౌన్ వేళ.. పేదలకు ప్రభుత్వం ఇస్తానన్న వెయ్యి రూపాయిల ఆర్థిక సాయం గురించి వసంతరాయపురంలోని లబ్థిదారుడు ఒకరు గ్రామవాలంటీర్ ను ప్రశ్నించాడు. అలా అడుగుతావేంటి? అంటూ దురుసుగా సమాధానం చెప్పిన గ్రామ వాలంటీర్ ను సదరు యువకుడు వారిస్తూ.. ప్రభుత్వం ఇస్తానన్న డబ్బుల గురించి అడగటమే తప్పా? అంటూ ప్రశ్నించారు.

దీంతో.. గ్రామ వాలంటీర్ కు కోపం వచ్చింది. ఏంట్రా నీకిచ్చేది అంటూ సదరు యువకుడిపై దాడి చేయటమే కాదు.. తనతో పాటు మరికొందరు వాలంటీర్లతో కలిసి ఆ యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో సదరు యువకుడి కంటికి గాయమైంది. తనపై జరిగిన దాడి గురించి అరండల్ పేట్ పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలన్న సదుద్దేశ్యంతో జగన్ సర్కారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తెర మీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా.. మధ్యవర్తలుగా వ్యవహరించి ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెచ్చేందుకు పని చేయాల్సిన గ్రామ వాలంటీర్లు ఇలా దాడికి దిగిన వైనం సరికాదంటున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని ప్రశ్నించటమే తప్పన్నట్లుగా వ్యవహరించిన వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్న వాదన వినిపిస్తుంది. మరి.. దుందుడుకుగా వ్యవహరించిన వాలంటీర్ల విషయంలో జగన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.