Begin typing your search above and press return to search.

తిరుమల కంటైన్మెంట్ పై ప్రభుత్వం వెనక్కి

By:  Tupaki Desk   |   9 July 2020 3:59 PM GMT
తిరుమల కంటైన్మెంట్ పై ప్రభుత్వం వెనక్కి
X
దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన కొద్దిసేపటికే అధికారులు వెనక్కితగ్గారు. తాజాగా టీటీడీకి చెందిన 80మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా రావడంతో చిత్తూరు కలెక్టర్ తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ఈ మధ్యాహ్నం 2.30కి ప్రకటించారు.

అయితే ఇక భక్తుల దర్శనాలకు కష్టం అని అందరూ భావిస్తున్న సమయంలోనే గంట తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశానుసారం తిరుమలను కంటైన్మెంట్ జోన్ నుంచి మినహాయించారు. భక్తుల మనోభావాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తిరుమల కంటైన్మెంట్ జోన్ కాదని.. పొరపాటున ప్రకటించామని అధికారులు మరో ప్రకటన విడుదల చేశారు. తాజా ప్రకటనతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల దర్శనాలకు ఆటంకం తొలిగిపోయింది. భక్తులు ఎలాంటి భయం లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే తిరుమలలో కరోనా వ్యాప్తి పెరగడంతో టీటీడీ దర్శనాలను పరిమితం చేసింది. రోజుకు కేవలం 10వేల దర్శనాలను అదీ కరోనా నియమ నిబంధనల ప్రకారం అనుమతిస్తోంది. అయితే ఇంత చేస్తున్న టీటీడీ సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకడంతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది.