Begin typing your search above and press return to search.

మంత్రికి పూలు జల్లండి.. నవ్వుతూ కనపడిండి: డ్వాక్రా మహిళలకు అధికారి వివాదాస్పద ఆదేశాలు

By:  Tupaki Desk   |   30 Jan 2023 4:31 PM GMT
మంత్రికి పూలు జల్లండి.. నవ్వుతూ కనపడిండి: డ్వాక్రా మహిళలకు అధికారి వివాదాస్పద ఆదేశాలు
X
ఏపీలో కొందరు తాము అధికారులమన్న సంగతిని మరిచిపోయి వైసీపీ నేతలపైన స్వామి భక్తిని చూపుతున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శలకు తగ్గట్టే శ్రీకాకుళం జిల్లాలో ఒక అధికారి వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఘనస్వాగతాలు పలకలంటూ ఒక అధికారి డ్వాక్రా మహిళలకు ఆదేశాలు జారీ చేసిన వైనం కలకలం రేపుతోంది.

ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు మీద ఏపీఎం ప్రసాదరావు స్వామిభక్తిని ప్రదర్శించారు. ఫిబ్రవరి 2న జిల్లుండ గ్రామంలో మంత్రి సీదిరి అప్పలరాజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో డిమిరియా గ్రామంలో డ్వాక్రా మహిళలతో ఏపీఎం ప్రసాదరావు సమావేశమయ్యారు. డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ మహిళలకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రిగారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు ఇలా చేయండి.. అలా చేయండని వారికి సూచించారు.

మంత్రి సీదిరి అప్పలరాజు రాగానే ఆయనపై పూలు చల్లాలని, నవ్వుతూ ఉండాలని ఆదేశించారు. కుదిరితే ఒకరిద్దరు హారతులు కూడా పట్టాలన్నారు. అంతేకాకుండా మంత్రి సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో చప్పట్లు కూడా కొట్టాలని ఆదేశాలు చేశారు. పైగా మీరు పూలు చల్లుతారా లేదా.. చప్పట్లు కొడతారా లేదా.. నవ్వుతారా లేదా అంటూ ఆయన డ్వాక్రా మహిళలను ప్రశ్నించారు. లేకపోతే డ్వాక్రా రుణాలు దక్కవంటూ ఆయన బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

ఇందుకు డ్వాక్రా మహిళలు సైతం పూలు చల్లుతాం.. చప్పట్లు కొడతాం.. నవ్వుతాం అంటూ ఆయనకు బదులివ్వడం గమనార్హం. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అధికారి చెప్పింది చేయకపోతే తమకు ఎక్కడ రుణాలు రాకుండా చేస్తారోనని భయపడ్డ మహిళలు ప్రసాదరావు చెప్పినదానికి అంగీకరించారు.

దీంతో ప్రసాదరావు ప్రభుత్వ అధికారి లేక వైసీపీ కార్యకర్తా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రైవేట్‌ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలందరినీ హాజరు కావాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయనపై పూలు చల్లండి.. హారతులు పట్టండి.. చప్పట్లు కొట్టండి అంటూ ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.