Begin typing your search above and press return to search.

రాజా సింగ్ రాజీనామానా? గోషామహల్ లో రచ్చ

By:  Tupaki Desk   |   22 Nov 2020 12:30 PM GMT
రాజా సింగ్ రాజీనామానా? గోషామహల్ లో రచ్చ
X
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ ముగిసిపోవడంతో ఇప్పుడు ప్రచారం హోరెత్తుతోంది.అయితే అసంతృప్తులు తమకు సీట్లు రాలేదని గళమెత్తుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామన్న బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆశావహులు అందరూ నిమినేషన్లు అయితే వేశారు.

అయితే గోషామహల్ నియోజకవర్గంలోని బీజేపీలో మాత్రం రచ్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తనను నమ్ముకున్న వారికి టికెట్లు ఖరారు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ అధిష్టానాన్ని పట్టుబట్టగా అందుకు బీజేపీ సరైన స్పందన వ్యక్తం చేయలేదని ప్రచారం సాగుతోంది. దీనిపై కలత చెందిన రాజాసింగ్ రాజీనామా చేస్తున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

అయితే ఆ వార్తలను రాజాసింగ్ ఖండించారు. అయితే సీట్ల విషయంలో బీజేపీ అగ్రనేతలకు, రాజాసింగ్ కు ఆధిపత్య పోరు నడుస్తోందని.. పడడం లేదని మాత్రం వార్తలు వస్తున్నాయి.

గోషామహల్ డివిజన్ లో డాక్టర్ లక్ష్మణ్ తన దగ్గరి బంధువులకు టికెట్లు ఇప్పించుకున్నారని.. జాంబాగ్, గోషామహల్ నాయకులు లక్ష్మణ్ ను ఈ మేరకు ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. తమను కాదని టికెట్ కేటాయిస్తే సహకరించబోమని స్థానిక నేతలు చెప్పినట్టుగా తెలిసింది.

గన్ ఫ్రౌండ్రీ, గోషామహల్ , మంగళ్ హాట్, జాంబాగ్ టికెట్లు రాజాసింగ్ కోరిన వారికి ఇవ్వాలని.. మిగతా టికెట్లు మీ ఇష్టం అని చెప్పినట్టు సమాచారం. అయితే అందుకు భిన్నంగా అక్కడ టికెట్ల కేటాయింపు ఉండడంతో రాజాసింగ్ అలకబూని రాజీనామా అస్త్రం సంధించబోతున్నట్టు ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. రాజాసింగ్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. టికెట్ల లొల్లి బీజేపీలో అసమ్మతికి కారణమవుతున్నట్టు తెలుస్తోంది.