ఎంపీ గోరంట్ల మాధవ్ పై వేటు ఖాయమేనా?

Fri Aug 05 2022 16:25:28 GMT+0530 (IST)

Sajjala Ramakrishna Reddy announced strict action  taken if Gorantla's video True

ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పార్టీ అధిష్టానం వేటు వేయనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వీడియో ఫేక్ అని.. కొంతమంది టీడీపీ నేతలు దాన్ని మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని మాధవ్ చెబుతున్న సంగతి తెలిసిందే.మరో ప్రభుత్వ సలహాదారు వైఎస్సార్సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తమ విచారణలో ఎంపీ తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

కాగా ఎంపీ మాధవ్ తన వీడియోను ఫోరెన్సిక్ విచారణ చేయించాలని.. అది ఒరిజినల్ అని తేలితే తల నరుక్కుంటానని సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారం మేరకు ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడింది నిజమేనని వెల్లడయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇటువంటి అనైతిక కార్యక్రమాలను ఉపేక్షిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారని సమాచారం. అయితే గోరంట్ల మాధవ్ ను సస్పెండ్ చేస్తే పార్టీకి కలిగే లాభనష్టాలపై సీఎం జగన్ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేసినట్టు చేయాల్సిందేనని మెజారిటీ అభిప్రాయంగా ఉందని అంటున్నారు.

మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. లేదా ఆయనతో ఎంపీ పదవికి రాజీనామా చేయించడం అనే అంశాలపై వైఎస్సార్సీపీ అధిష్టానం మీమాంసలో ఉందని చెబుతున్నారు.

గోరంట్ల వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో.. ఎంపీపై సస్పెన్షన్ వేటు తప్పదనే అభిప్రాయానికి వైఎస్సార్సీపీ వర్గాలు వచ్చాయి. ఈ దిశగా అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న మీడియా చానళ్లకు సమాచారం అందిందని అంటున్నారు.