టిక్ టాక్ ను గూగుల్ నుంచి తీసేశారు

Wed Apr 17 2019 10:27:27 GMT+0530 (IST)

Google blocks TikTok in India

వీడియో తర్వాత వీడియో.. నవ్విస్తూ.. ఎటకారం చేస్తూ.. అదే సమయంలో హద్దులు దాటేసే టిక్ టాక్ యాప్ కు భారీ దెబ్బ తగిలింది. ఈ యాప్ ను బ్యాన్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం.. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అనంతరం ఈ అంశంపై సుప్రీం కూడా అదే మాటను చెప్పటం.. కేంద్రం సైతం టిక్ టాక్ మీద చర్యలకు రెఢీ అయ్యింది. ఈ నేపథ్యంలో గూగుల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవటానికి వీల్లేని రీతిలో.. లిస్ట్ నుంచి తీసేసింది. దీంతో.. గూగుల్ నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసే అవకాశం ఈ రోజు నుంచి లేని పరిస్థితి నెలకొంది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్ తొలగించినప్పటికీ.. యాపిల్ స్టోర్ నుంచి అందుబాటులోనే ఉండటం గమనార్హం. ఈ పరిణామంపై గూగుల్.. యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కొద్దిరోజులుగా టిక్ టాక్ లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ అందుతున్న ఫిర్యాదుతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాప్ లలో గూగుల్.. ఆపిల్ తర్వాత టిక్ టాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ లో 240 మిలియన్ల కంటే ఎక్కువసార్లు డౌన్ లోడ్ అయ్యింది. 30 మిలియన్ల కంటే ఎక్కువమంది వినియోగదారులు 2019 జనవరిలో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేయటం గమనార్హం.