Begin typing your search above and press return to search.

స‌చివాల‌య ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ప్రొబేష‌న్ జీవో విడుద‌ల‌

By:  Tupaki Desk   |   25 Jun 2022 8:30 AM GMT
స‌చివాల‌య ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ప్రొబేష‌న్ జీవో విడుద‌ల‌
X
ఆంధ్ర‌ప్రదేశ్ లో గ్రామ‌, వార్డు సచివాలయాల‌య ఉద్యోగులకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఆ ఉద్యోగుల‌ ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను జూన్ 25న‌ శనివారం విడుదల చేసింది. ఉద్యోగంలో రెండేళ్లు పూర్తి చేసుకుని.. డిపార్టుమెంట‌ల్ టెస్టు ఉత్తీర్ణుల‌యిన వారంద‌రికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేర‌కు జ‌గ‌న్ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెంబర్ 5ను జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేత‌న శ్రేణిని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఖరారు చేసింది. పంచాయతీ సెక్ర‌టరీ, వార్డ్ సెక్ర‌టరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810గా నిర్ధారించింది.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక‌ 1.34 లక్షల గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్‌ నెలాఖరు కల్లా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ పూర్తి చేయ‌నున్నారు.

జూలై నెల నుంచి పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్‌ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగులు ఆగ‌స్టు 1 నుంచి పెరిగిన జీతాల‌ను అందుకోనున్నారు.

కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుకు సంబంధించిన తొలి జాబితాలో దాదాపు 17 వేల మంది పేర్లు ఉండకపోవచ్చని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిలో రెండేళ్ల సర్వీసు పూర్తవ్వని, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వని వారు ఉన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన దాదాపు లక్ష మందికి మాత్ర‌మే తొలి దశలో ప్రొబేషన్‌ ఖరారు చేయనున్నారని అంటున్నారు.

మిగిలిన 17 వేల మంది ఉద్యోగులు డిపార్టుమెంట‌ల్ టెస్టులో ఎప్పుడు ఉత్తీర్ణులైతే అప్పుడు ప్రొబేషన్‌ ఖరారు చేసేలా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారాలు ఇచ్చింద‌ని స‌మాచారం. మ‌రోవైపు ఇప్పటికే పరీక్షలు రాసి ఉత్తీర్ణులవ్వని ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఇటీవ‌ల డిపార్టుమెంట‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.