పండగ తర్వాత టీఆర్ఎస్ లో పదవుల జాతరే..!

Mon Jan 17 2022 08:23:41 GMT+0530 (IST)

Good News For Trs Party Leaders

సంక్రాంతి పండగ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో పదవుల పందేరానికి తెర లేవనుంది. నామినేటెడ్ పదవులకు కసరత్తు ఇటీవలే పూర్తయినా పండగ పీడరోజులని ప్రకటనను వాయిదా వేశారు. అలాగే.. రాష్ట్రంలో రాజకీయాలు.. ధాన్యం కొనుగోళ్ల సమస్యలు అడ్డు రావడంతో కార్పొరేషన్ పదవుల పందేరం ఆగిపోయింది. రాష్ట్ర స్థాయిలో ఆరు కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్ పదవులు ఖరారయ్యాయట.క్రితం సంవత్సరం చివర్లోనే చాలా వరకు నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ పదవులు భర్తీ చేశారు. 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి గవర్నర్ కోటాలో భర్తీ చేయగా.. ఆరు స్థానాలను ఎమ్మెల్యేల కోటాలో పూర్తి చేశారు. మిగతా 12 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే ఇందులో 6 స్థానాలు ఏకగ్రీవం అవగా.. మిగతా 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లాయి.

కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పట్నం మహేందర్‌రెడ్డి శంభీపూర్ రాజు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కసిరెడ్డి నారాయణరెడ్డి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి దండె విఠల్ ఎంసీ కోటిరెడ్డి తాతా మధుసూదన్ ఎల్.రమణ టి.భానుప్రసాదరావు డాక్టర్ యాదవరెడ్డి ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. కొందరు పార్టీ నేతలను ఆయా కార్పొరేషన్ పదవుల్లో భర్తీ చేశారు. మిగిలిన పదవుల భర్తీపై ఇపుడు దృష్టి పెట్టారు. పండగ తర్వాత ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందట.

బీసీ మైనార్టీ సంక్షేమం వ్యవసాయ నీటిపారుదల మునిసిపల్ ఆర్ అండ్ బీ సహా పలు విభాగాల పరిధిలోని కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సభ్యులను కూడా నియమించాల్సి ఉంది. ఈసారి ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ లను వేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరికొంత ఆలస్యం జరగవచ్చట.

పార్టీ పదవుల కోసం ఆశావహులు చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు. మిగిలిన పోస్టులను త్వరగా భర్తీ చేసి పార్టీలో అసంతృప్తులను చల్లార్చాలని.. వచ్చే ఎన్నికల కోసం టీమ్ ను సిద్దం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణరావు రవీందర్ సింగ్ లు తమకు రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. మిగతా జిల్లాల్లో కూడా ఆశావహుల జాబితా భారీగానే ఉంది. పదవుల భర్తీ తర్వాత పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయో.. అసంతృప్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.