Begin typing your search above and press return to search.

కేటీఆర్ నోటి మాటతో రాకెట్ వేగంతో దూసుకెళ్లనున్న హయత్ నగర్

By:  Tupaki Desk   |   7 Dec 2022 4:31 AM GMT
కేటీఆర్ నోటి మాటతో రాకెట్ వేగంతో దూసుకెళ్లనున్న హయత్ నగర్
X
హైదరాబాద్ మహానగరానికి మంచి రోజులు వచ్చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు నలభై శాతం మంది ఉండేది నగరంలోనే. అంతేనా? రాష్ట్రానికి సంబంధించిన కీలక ఆదాయ వనరు కూడా హైదరాబాదే. అలాంటి భాగ్యనగరి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేయాల్సినంత చేయలేదన్న విమర్శ ఉంది.

కోటి మందికి పైగా జనాభా ఉన్న మహానగరానిక కల్పించాల్సిన సౌకర్యాలు.. మౌలిక వసతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మరింత చేయాల్సి ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అన్ని కాకున్నా.. నగర జీవికి తరచూ నరకాన్ని చూపించే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటివరకు జరిగింది అంతంతమాత్రమే అన్నది తెలిసిందే.

నగరం నలుమూలలకు మెట్రోను విస్తరించటం ద్వారా.. ట్రాఫిక్ ను తగ్గించే వీలున్నా.. నిధుల కొరతతో ఆ దిశగా అడుగులు పడింది లేదు. మరో రెండు.. మూడు రోజుల్లో దాదాపు రూ.7వేల కోట్ల ఖర్చుతో ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు సౌకర్యం కల్పించే ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతున్న వేళ.. నగరానికి మరో తీపి కబురును అందించారు మంత్రి కేటీఆర్.

తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్ బీ నగర్ వరకు ఉన్న మెట్రో రైలు సౌకర్యాన్ని.. హయత్ నగర్ వరకు విస్తరించే యోచనలో ఉన్నట్లుగా చెప్పారు.

ఆ ప్రాజెక్టును టేకప్ చేసేది ఎప్పుడున్న విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల తర్వాత తాము ఆ ప్రాజెక్టును చేపడతామని చెప్పటం గమనార్హం. ఇప్పటికే ఎయిర్ పోర్టు మెట్రోను మూడేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకోవటం.. షెడ్యూల్ ప్రకారం చూసినప్పుడు వచ్చే ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన విషయం తెలిసిందే.

ఇదంతా చూసినప్పుడు డెవలప్ మెంట్ యాక్టివిటీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం.. అది కూడా హైదరాబాద్ మహానగర లక్ష్యంగా ఉండటం మంచి పరిణామంగా చెబుతున్నారు. ఒక విధంగా హైదరాబాద్ ముఖ చిత్రం మారటంతో పాటు.. ఈ ప్రాజెక్టుల పూర్తికి మరోసారి కేసీఆర్ సర్కారు అధికారంలోకి వస్తే బాగుంటుందన్న భావన కలిగేలా చేస్తుందంటున్నారు. కేటీఆర్ మాటతో ఇప్పటివరకు ఒక మోస్తరుగా ఉండే ఎల్ బీ నగర్ - హయత్ నగర్ రియల్ ఎస్టేట్ మరింత వేగం పుంజుకోనుందని చెబుతున్నారు. ఒక విధంగా హైదరాబాద్ శివారుకు కేటీఆర్ తాజా మాట స్వీట్ న్యూస్ గా చెబుతున్నారు.