Begin typing your search above and press return to search.

జులై మొదటి వారంలోనే కృష్ణా, గోదావరి పంటపండుతోంది

By:  Tupaki Desk   |   8 July 2020 3:45 AM GMT
జులై మొదటి వారంలోనే కృష్ణా, గోదావరి పంటపండుతోంది
X
చాలాకాలం తర్వాత జులై మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో జీవధారలైన కృష్ణా, గోదావరి నదులకు వరద మొదలైంది. కృష్ణా, గోదావరి బేసిన్ లలో మంచి వర్షాలు కురుస్తుండటంతో రెండు నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. గోదావరికి పైన నాసిక్ నుంచి, ఇటు చత్తీస్ ఘడ్, ఒడిసాల నుంచి ఉపనదుల ద్వారా వరద వస్తోంది.

తాజాగా సోమవారం ఆల్మట్టికి దాదాపు 30 వేల క్యూసెక్కుల వరకు వరద ఫ్లో ఉంది. అయినా 129.82 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆల్మట్టి జలాశయంలో ప్రస్తుతం ఇంకా 76 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయినా కూడా కొంత నీరు కిందకు వదులుతూ ఉండటంతో 4,074క్యూసెక్కులు నీరు జూరాలకు వస్తోంది. ప్రస్తుతం 7.28 టీఎంసీల నీరుంది. జూరాల కెపాసిటీ 9.66 టీఎంసీలు.

గోదావరికి బాబ్లీ నుంచి కొంత వరద వస్తోంది. అదే సమయంలో ఎస్సారెస్పీ పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ కు నీరు చేరుతోంది. కడెం నుంచి కూడా వరద వస్తోంది. ఇక ఖమ్మం, వరంగల్ సరిహద్దులో గోదావరికి 30,016 క్యూసెక్కుల నీరు అందుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల ద్వారా నీరు బాగా చేరుతోంది. ప్రాణహిత మహారాష్ట్ర నుంచి, ఇంద్రావతి ఒడిసాలోని తూర్పుకనుముల నుంచి వస్తుంది. గోదావరికి భారీగా వరద తెచ్చేనది ఇంద్రావతే. అందుకే ప్రతి ఏటా ధవళేశ్వరం నిండేది. ప్రఖ్యాతిగాంచిన చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఈ నది వల్లే ఏర్పడుతుంది. దీంట్లో వరద మొదలవడంతో గోదావరికి నీరు చేరుతోంది. మొత్తానికి చాలా త్వరగా తెలుగు రైతులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది.