వైసీపీకి మంచి మార్కులు.. మోడీ మరింత దగ్గరే!

Mon Sep 21 2020 23:00:17 GMT+0530 (IST)

Good marks for YCP .. Modi is closer!

ఎప్పుడు ఎలాంటి వ్యూహంతో అడుగులు వేస్తే.. సక్సెస్ అవుతాయో.. ఎప్పుడు ఎక్కడ తగ్గితే.. మార్కులు పడతాయో.. ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి మార్కులు సంపాయించుకోవడం.. రాజకీయాల్లో నేతలకు అలవాటైన ప్రక్రియే. అయితే ఈ విషయంలో ఒక్కక్కసారి తడబడినా.. అధికార వైసీపీ మాత్రం తరచుగా రాజకీయ ఎత్తుగడల్లో ముందుంటున్న విషయం గమనార్హం. కేంద్రాన్ని తనదైన శైలిలో తన దారికి తెచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారనేది కూడా వాస్తవం.కేంద్రంలోని నరేంద్ర మోడీ తీసుకున్న అనేక నిర్ణయాల విషయంలో జగన్ తమ మద్దతును ప్రకటించా రు. రాష్ట్రపతి ఎన్నిక ఉప రాష్ట్ర పతి ఎన్నికల నుంచి తలాక్ బిల్లు ఆర్టికల్ 370 రద్దు వంటికీలకమైన బిల్లుల విషయంలో జగన్ మద్దతుగా నిలిచారు. అదేసమయంలో బీజేపీ కోరిన మేరకు రాజ్యసభ స్థానాలను వేరేవారికి ఇవ్వడంలోనూ జగన్ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర జగన్‌కు ఆయన పార్టీ ఎంపీలకు మార్కులు పడుతున్నా.. ఆశించిన విధంగా మాత్రం పడలేదు.

ఏదో మద్దతిస్తున్నారు.అందరితోపాటే! అనుకుంటున్నారు బీజేపీ జాతీయ సారథులు సహా.. ప్రధాని నరేంద్ర మోడీ. కానీ ఇప్పటికి వారికి వైసీపీ వాల్యూ తెలిసి వచ్చిందని అంటున్నారు. తాజా పరిణామాలతో మోడీకి వైసీపీ మరింత దగ్గరైందని. అంటున్నారు. దీనికి కీలక కారణం.. దేశంలోని సగానికిపైగా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడమే కాదు.. బీజేపీ బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో సాయిరెడ్డి కత్తి దూయడం.. వంటివి బీజేపీకి నచ్చేసిన విధానాలుగా చెబుతున్నారు.

పైగా తమకు మద్దతుగా ఉన్న శిరోమణి అకాలీదళ్ వంటి కీలక పార్టీ వ్యవసాయ బిల్లు విషయంలో విమర్శలు గుప్పించి చేజారిపోవడం కేంద్ర మంత్రి పదవిని కూడా త్యజించడం వంటి కీలక ఆపత్కాలంలో.. వైసీపీ వంటి పార్టీ ఆదుకున్న విషయం.. రాజ్యసభలో మోడీపై ప్రసంశలు కురిపించిన విషయాలు ప్రధాని మనసును హత్తుకున్నాయని అంటున్నారు.. పరిశీలకులు. ఇది వైసీపీని .. మోడీకి మరింత చేరువ చేయడం ఖాయమని తద్వారా జగన్ ఏపీ ప్రయోజనాలను సాధించే అవకాశం మెరుగు పడుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ అవకాశాన్ని జగన్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో.. చూడాలి.