పెళ్లి పేరుతో నయా దందా.. యువతనే టార్గెట్..!

Tue Nov 29 2022 13:00:01 GMT+0530 (India Standard Time)

Girl for rent.. New fraud in the name of marriage..!

పెళ్లి పేరుతో యువతీ యువకులను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ వెలుగు చూస్తున్నాయి. 30 ఏళ్లు దాటినా పెళ్లి కానీ యువకులు.. విడాకులై రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని కొందరు కేటుగాళ్లు నయా దందాకు తెరలేపుతున్నారు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తుండటంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.వివాహా పరిచయ వేదికల పేరుతో ముఠాను ఏర్పాటు చేసుకొని సైబర్ కేటుగాళ్లు కొత్త దందాకు తెరలేపుతున్నారు. వీరి వద్ద పని చేసే టెలికాలర్స్ ను పెళ్లి కూతుళ్ళుగా నమ్మించి యువకులను బురిడీ కొట్టిస్తున్నారు. కాఫీ షాపులు.. పార్కుల్లో పెళ్లి చూపుల పేరుతో వీలైనంత మేరకు వారి నుంచి బహుమతులు.. వగైరా పేరుతో డబ్బులు గుంజుతున్నారు. ఆ తర్వాత అభిరుచులు కలువలేదని యువకులను కట్ చేస్తున్నారు.

ఎవరైనా గట్టిగా నిలదీస్తే లైంగిక వేధింపుల కేసులు పెడతామని తిరిగి బాధితులనే బెదిరిస్తుండటంతో అంతా సైలెంట్ అయిపోతున్నారు. అయితే సరూర్ నగర్లో ఓ నకిలీ వివాహా పరిచయ వేదిక  కూకట్ పల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి లక్షన్నర వసూలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నకిలీ మ్యాట్రీమోని మోసం వెలుగు చూసింది.

అదేవిధంగా అమెరికాలో సివిల్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి సరూర్ నగర్ కు చెందిన మహిళ నుంచి 18 లక్షలు కాజేశారు. విలువైన బహుమతులు పంపిస్తున్నా.. ఢిల్లీ కస్టమ్స్ వద్ద ఆ వస్తువులు ఉన్నాయమని మరో వ్యక్తి రంగంలోకి కస్టమ్ చార్జీల పేరిట 18లక్షలు కాజేశారు. ఈ వ్యక్తితో గత నెలలో బాధిత మహిళ ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ వ్యక్తి ఇప్పటి వరకు సుమారు 50 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు వెలుగు చూసింది. ఇక నైజీరియన్ బ్యాచ్ పెళ్లి పేరుతో దేశ వ్యాప్తంగా 300 మంది యువతులను మోసగించి కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ కేటుగాళ్లను గత మే నెలలో నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలోనే అపరిచితులతో వ్యక్తిగత విషయాలు.. ఆర్థిక పరమైన అంశాల గురించి చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. బాధితులు ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.