Begin typing your search above and press return to search.

పొంచివున్న మరో ముప్పు.. అమెరికా-చైనా యుద్ధం తప్పదా..!

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:49 AM GMT
పొంచివున్న మరో ముప్పు.. అమెరికా-చైనా యుద్ధం తప్పదా..!
X
ఆధునిక కాలంలోనూ కొన్ని దేశాలు యుద్ధ కాంక్షను వీడటం లేదు. అణ్వాయుధాలు.. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలువడం శోచనీయంగా మారుతోంది. భారత్ లాంటి శాంతికాముక దేశాలు ఇది యుద్ధాలు చేసే కాలం కాదని.. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతారని సూచిస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి(ఐరాస) సైతం యుద్ధాలకు స్వస్తి పలుకాలని పిలుపునిస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారుతోంది.

గత ఏడాది ప్రారంభంలోనే రష్యా ఉక్రెయిన్ పై వార్ ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో మొదలైన వార్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో అనేకమంది సైనికులు.. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది ప్రజలు ఉక్రెయిన్ వీడి పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. ఇరుదేశాల అధ్యక్షులు ఎవరికీ వారు పంతం వీడక పోవడంతో రష్యా-ఉక్రెయిన్ వార్ కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందా? అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.

ఇలాంటి సమయంలోనే అమెరికాకు చెందిన సీనియర్ సైనికాధికారి జనరల్ మైక్ మిన్ హాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025లో అమెరికా చైనా దేశాల మధ్య యుద్ధం తలెత్తే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేశారు. అయితే తన అంచనా తప్పయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పడం గమనార్హం. ఇకపోతే ఆయన 50 వేల సిబ్బంది పని చేసే ఎయిర్ మొబిలిటీ కమాండ్ కు నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగం 500 విమానాలు సైనిక దళాలకు సంబంధించిన రవాణా.. ఇంధన సరఫరాను పర్యవేక్షిస్తుంది.

2024లో అమెరికా.. తైవాన్ దేశాల్లో అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని మిన్ హాన్ తన విభాగంలోని సభ్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా దృష్టి మొత్తం ఎన్నికలపైనే ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని చైనా తైవాన్ విషయంలో ముందుకెళ్లడానికి మార్చుకునే అవకాశం లేకపోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆ దిశగా తీసుకుంటున్న కీలక చర్యలపై తనకు ఫిబ్రవరి 28 లోగా నివేదించాలని తన విభాగంలోని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు స్పందిస్తూ మిన్ హన్ వ్యాఖ్యలు రక్షణ శాఖ వైఖరిని ప్రతిబింబించవని తెలిపారు. అలాగే వాయుసేన బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ మాట్లాడుతూ చైనాతో సైనిక పోటీ తమ ముందున్న సవాల్ అని స్పష్టం చేశారు. అయితే తమ దృష్టంతా స్వేచ్ఛా వాణిజ్యం.. శాంతియుత ఇండో పసిఫిక్ మిత్ర దేశాలతో కలిసి పని చేయడంపైనే ఉంటుందన్నారు.

కాగా గతంలో రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ తైవాన్ జలసంధి వద్ద చైనా తన సైనిక కార్యకలాపాలు ముమ్మరం చేస్తుండటంతో తైవాన్ ఆక్రమణకు ఆ దేశం సిద్దమవుతువుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏదిఏమైనా గత కొన్నేళ్లుగా అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కాస్త అసలు యుద్ధానికి దారి తీస్తుందా? అన్న సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇది కనుక జరిగితే అది ప్రపంచానికి మరో ముప్పుగా మారడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.