దేశంలో అత్యంత ధనవంతుడు ఆయనే.. అంబానీని దాటేశాడు

Wed Jan 26 2022 23:00:01 GMT+0530 (IST)

Gautam Adani became the richest person in the country

ఇన్నాళ్లు దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే అందరూ ఠక్కున అంబానీ అనేవారు. ఇప్పుడు దాన్ని ‘అదానీ’గా మార్చుకోవాలి. అవును అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారతదేశంలో అత్యంత సంపన్న భారతీయుల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచాడు.ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా నెట్ వర్త్ జాబితా ప్రకారం.. ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ మొదటి స్థానంలోకి చేరుకున్నాడు. గౌతమ్ అదానీ సంపద ముఖేష్ అంబానీని మించిపోయింది.

దేశీయ స్టాక్ మార్కెట్ లో రెండు రోజులుగా భారీ పతనం నమోదవగా.. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోయాయి.  ఈ కారణంగానే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నికర విలువ భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో అదానీ గ్రూప్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. దీంతో గౌతమ్ అదానీ నికర విలువ అలాగే ఉండిపోయింది.

జనవరి 25వ తేదీన అంటే నిన్న గౌతమ్ అదానీ సంపాదన ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టేయగా భారతదేశపు అత్యంత సంపన్నుడిగా అయ్యారు అదానీ.. గౌతమ్ అదానీ సంపద 90 బిలియన్ డాలర్లు అంటే 6.72 లక్షల కోట్లు కాగా.. ముఖేష్ అంబానీ నికర విలువ 89.8 బిలియన్ డాలర్లు అంటే రూ.6.71 లక్షల కోట్లకు చేరుకుంది.

దీంతో భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నంబర్ 1 స్థానంలోకి అదానీ వచ్చారు. ఇన్నాళ్లు ఉన్న అంబానీ రెండో స్థానంలోకి జారిపోయారు.  సంపాదన పరంగా అదానీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నారు.