Begin typing your search above and press return to search.

బెజవాడపై మరో బాంబు.. వ్యాపారులపై 25 కోట్ల చెత్త పన్ను!

By:  Tupaki Desk   |   17 May 2022 12:30 PM GMT
బెజవాడపై మరో బాంబు.. వ్యాపారులపై 25 కోట్ల చెత్త పన్ను!
X
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి చెత్త పన్ను వసూలు చేస్తూ చెత్త ప్రభుత్వంగా జగన్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. అయినా వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. చెత్త పన్ను తమ ప్రభుత్వ నిర్ణయం కాదని అంటోంది. పట్టణాలు, నగరాల్లో చెత్త పన్ను వసూలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటోంది. పట్టణాలు, నగరాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించాలని కేంద్రం చెబుతోందని.. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు చెత్త పన్ను వసూలు చేస్తున్నాయని తనదైన భాష్యం చెబుతోంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని, చెత్త ముఖ్యమంత్రి అని నిప్పులు చెరుగుతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి ఇంటికి వచ్చి వలంటీర్లు చెత్త పన్నును వసూలు చేస్తున్నారు.

తాజాగా రాజధాని నగరం విజయవాడపై పన్నుల రూపంలో ఏపీ ప్రభుత్వం మరో బాంబు విసురుతోంది. ఇప్పటికే ఇంటింటికి చెత్త పన్ను వసూలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వ్యాపారుల నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్పొరేషన్‌ కౌన్సిల్‌ ప్రతిపాదనలను గతేడాది ఆమోదించారు. అయితే ప్రస్తుతం నివాస ప్రాంతాల నుంచే చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. ఇక నుంచి నివాస ప్రాంతాలతోపాటు నివాసేతర ప్రాంతాల నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేయనున్నారు. ఇలా దాదాపు అన్ని వర్గాల వ్యాపారుల నుంచి ఏడాదికి రూ.25 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

విజయవాడను చెత్త రహిత, డస్ట్‌బిన్‌ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతూ.. ఆ ముసుగులో నగరంలోని 2.85 లక్షల కుటుంబాల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా 35 వేల వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి కూడా యూజర్‌ ఛార్జీల రూపంలో చెత్త పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏడాదికి రూ.25.40 కోట్లు భారం ప్రజలపై పడనుంది. రానున్న కాలంలో దాదాపు 3.16 లక్షల కుటుంబాలను, 48 వేల వ్యాపార సంస్థలను చెత్త పన్ను పరిధిలోకి తేనున్నారు.

ప్రస్తుతం ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త పేరిట ప్రభుత్వం చెత్తను సేకరిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చెత్త వాహనాలను, డ్రైవర్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి మందుకొచ్చి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా చెత్తను సేకరించినందుకు ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.120 వసూలు చేస్తున్నారు. ఇకపై షాపింగ్‌ మాల్స్, అన్ని వ్యాపార దుకాణాలు, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త పన్ను వసూలు చేయనున్నారు.

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు నుంచి నెలకు రూ.15 వేలు, త్రీస్టార్‌ హోటళ్లకు రూ.10,000, 40కి పైగా పడకలున్న ఆస్పత్రులకు నెలకు రూ.10,000, 50పైన గదులున్న లాడ్జిలకు నెలకు రూ.5000, ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలు, ఎగ్జిబిషన్లకు రూ.15000 చొప్పున మోత మోగనుంది. ఇలా షాపు విస్తీర్ణం, ఆస్పత్రులు, లాడ్జిల గదుల సంఖ్యను బట్టి కనీసం రూ.1500 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు మోత మోగనుంది.