Begin typing your search above and press return to search.

సినిమా స్టోరీకి సరిపోయే ‘గ్యాంగ్ వార్’

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:30 AM GMT
సినిమా స్టోరీకి సరిపోయే ‘గ్యాంగ్ వార్’
X
పట్టపగలు.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగిందన్న వార్తలు చాలా సందర్భాల్లో విని ఉంటాం. అందుకు భిన్నంగా..కోర్టు హాలులో న్యాయమూర్తి కళ్ల ఎదుట నిందితుడి మీద ప్రత్యర్థులు కాల్పులు జరపటం.. దీంతో అతగాడు కుప్పకూలితే.. వెంటనే స్పందించిన ఎస్కార్ట్ పోలీసులు స్పందించి షూట్ చేయటం.. కాల్పులకు పాల్పడిన వారు కుప్పకూలిపోవటం.. గురించి చెబితే.. ఇదంతా రీల్ స్టోరీ అనుకోవచ్చు. కానీ.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ గ్యాంగ్ వార్ దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అయితే.. తాజా దాడిలో మరణించిన ఒక గ్రూపు నాయకుడు జితేందర్ గోగి.. అతడ్ని ఏసేసి టిల్లు తాజ్ పూరియాలు ఇద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు అంటే నమ్మశక్యంగా అనిపించదు.కానీ.. ఇది నిజమని చెబుతున్నారు.

2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో మొదలైన వీరిద్దరి విభేదాలు.. అంతకంతకు ముదరటమే కాదు.. పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అనంతరం అధిపత్య పోరుగా మారింది. చివరకు గ్యాంగ్ వార్ లు బోలెడన్ని జరిగాయి. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన పోరు కారణంగా దాదాపు వంద మంది వరకు మరణించి ఉంటారని చెబుతున్నారు.

వీరిద్దరి మధ్య గొడవలకు కాలేజీ స్టూడెంట్ యూనియన్ల ఎన్నికలు కారణమైతే.. ఢిల్లీ మాఫియాలో అధిపత్యం కోసం పెద్ద పోరు నడిచింది. అదే సమయంలో ఢిల్లీకి డాన్ గా చెప్పే మరో గ్యాంగ్ స్టర్ నీతూ దబోడియాను అప్పట్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంతో.. వీరిద్దరు ఆ స్థానాన్ని సొంతం చేసుకోవటం కోసం మరింత తీవ్రంగా ప్రయత్నించసాగారు. దీంతో అధిపత్య పోరు మరింత ముదిరింది.

గడిచిన పదేళ్లుగా వీరిద్దరి మధ్య పోరులో తాజాగా జితేంద్ర గోగిని కోర్టు హాల్లోనే టిల్లు తాజ్ పూరియా వర్గీయులు దారుణంగా హత్య చేయటం సంచలనంగా మారింది. టిల్లు తాజ్ పురియా గతంలో తీహార్ జైల్లో ఉండేవాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా ముఠా కార్యకలాపాల్నిసాగించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జితేంద్ర హత్యతో టిల్లు తిరుగులేని అధిక్యత వచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే.. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతగాడ్ని అదుపులోకి తీసుకుంటే.. ఢిల్లీకి పట్టిన శని కాస్త వదిలినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.