వీరశివారెడ్డి శివాలెత్తే సమయం వచ్చేసిందా...?

Tue Jan 24 2023 10:02:04 GMT+0530 (India Standard Time)

Gandlur Veerasivareddy Now the name is heard loudly among TDP leaders

గండ్లూరు వీరశివారెడ్డి. ఇప్పుడు టీడీపీ నేతల మధ్య జోరుగా వినిపిస్తున్న పేరు. అంతేకాదు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఈయనను వచ్చే ఎన్నికల్లో పోటీకి పెట్టే యోచన చేస్తున్నారని.. దీనికి సంబంధించిన వ్యూహాలు కూడా సిద్ధమవుతున్నాయని అంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న కమలాపురం ఎమ్మెల్యే సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డికి చెక్ పెట్టాలంటే.. ఈయనే కరెక్ట్ అనే భావనతో ఉన్నారని అంటున్నారు.దీంతో వీరశివారెడ్డి గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక ఈయన హవాను ఒక్కసారి పరిశీలిస్తే.. గతంలో ఈయన దూకుడు ఉన్న మాట నిజమే. కానీ ఇప్పుడు కాదనేది స్థానికంగా వినిపిస్తున్న మరో టాక్.

గతంలో 1994 2004 2009లో కమలాపురం నుంచి వీరశివారెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. తర్వాత.. టీడీపీ మళ్లీ కాంగ్రెస్ తర్వాత  టీడీపీలోకి వచ్చారు. ఇలా ఒక నిలకడలేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఆర్థికంగా కంటే కూడా.. భౌతిక బలం ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. అంత మాత్రాన ఇప్పుడు కమలాపురంలో ఆయన విజయం దక్కించుకుంటారా? అనేది ఆయన అనుచరుల వాదనగా ఉంది.

నిజానికి రాజశేఖర్‌రెడ్డి శిష్యుడిగా.. ఆయన కొన్నాళ్లు ఇక్కడ రాజకీయాలు చలాయించారు. తర్వాత.. జగన్ ఆయనను ఆహ్వానించినా.. రాలేదు. ఈ క్రమంలోనే టీడీపీలో చేరారు.  అయితే 2014 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

ఇక ఇప్పుడు ఆయన మళ్లీ టీడీపీ టికెట్‌పై పోటీ కి రెడీ అవుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే.. గెలుచుకొస్తారని టీడీపీలో చర్చ సాగుతోంది. అయితే.. వాస్తవానికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వైసీపీలోని ఒక  తటస్థ వర్గం స్పష్టంగా చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కే ఇక్కడ పట్టకడతారని.. టీడీపీ అనుకూల వర్గం అంతా కూడా వైసీపీలోచేరిపోయిందని..  ఇటీవల కూడా చాలా మంది నాయకులు వైసీపీ బాటపట్టారని అంటున్నారు. ఇలాంటి సమయంలో వీర శివారెడ్డి శివాలెత్తడం అంత ఈజీకాదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.