జగన్ పై జేసీ ప్రేమ.. ఇందుకోసమేనా?

Sun Dec 15 2019 17:21:01 GMT+0530 (IST)

Game Plan Of JC Diwakar Reddy

అనంతపురం మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి నోటి నుంచి ఏదీ వచ్చినా సంచలనమే.. సొంత పార్టీ అధినేత చంద్రబాబునే అప్పుడప్పుడూ తిడుతుంటారు ఆయన. ప్రత్యర్థులను పొగిడేస్తుంటారు. మరోసారి దీనికి పూర్తి భిన్నంగా చేస్తుంటారు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే జేసీ నోటికి ఏది వస్తే అది సంచలన వార్త అయ్యి కూర్చుంటుంది.ఎన్నికల ముందటి వరకూ చంద్రబాబును తెగ పొగిడేసి జగన్ ను తిట్టిపోసిన జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల్లో తన ఫ్యామిలీ మొత్తం ఓడిపోవడం.. చంద్రబాబు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ప్లేట్ ఫిరాయించాడు. వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడని.. ఎంతైనా మా కులపోడు అంటూ ఆకాశానికెత్తేశాడు. చంద్రబాబు ఏమన్నా కానీ ఆరు నెలల జగన్ పాలన భేష్ అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాలకు దూరమై వారి కుమారులను తాడిపత్రి ఎమ్మెల్యేగా అనంతపురం ఎంపీగా పోటీచేయించారు. ఇద్దరూ చిత్తుగా ఓడిపోయారు. తొలి అరంగేట్రంలోనే కొడుకులు ఓడిపోవడంతో ఖంగుతిన్న జేసీ బ్రదర్స్ టీడీపీలో ఉంటే కష్టమేనన్న భావనతో ఉన్నట్టు సమాచారం. అందుకే తాజాగా వైసీపీపై ప్రశంసలు కురిపిస్తూ అటువైపు చేరువ అవుతున్నారని అంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తాజాగా జగన్ పై కామెంట్స్ చేశారని అంటున్నారు.

ఇలా కాలానుగుణంగా జేసీ మారిపోతూ డబుల్ స్టాండ్ రాజకీయాలకు తెరతీశారు. అయితే టీడీపీ లేదంటే వైసీపీ అన్న భావనతోనే ఆయన ఇలా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.