మైనింగ్ కింగ్ కు సొంత సోదరుడి షాక్!

Mon Jan 23 2023 14:32:21 GMT+0530 (India Standard Time)

Gali Janardhan Reddy was shocked by his own brother Somesekhara Reddy

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) పేరుతో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో నిర్దేశించిన పరిమితికి మించి ఇనుప ఖనిజాన్ని తవ్వేసి వందల కోట్ల రూపాయలు ఆక్రమించినట్టు గాలి జనార్దన్ రెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులను బెదిరించడం లంచాలు ఇవ్వజూపడం పన్నులు ఎగ్గొట్టడం వంటి పలు కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి జైలుపాలు కూడా అయ్యారు. రెండేళ్లకు పైగానే జైలులో ఉన్నారు.గతంలో కర్ణాటకలోని బళ్లారి జిల్లాతోపాటు రాయచూరు తదితర జిల్లాలను కూడా తన కనుసైగతో శాసించారు.. గాలి జనార్దన్ రెడ్డి ఆయన సోదరులు గాలి సోమశేఖరరెడ్డి గాలి కరుణాకర్‌రెడ్డి. ఆ తర్వాత ఓఎంసీ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి నాటి బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పోగొట్టుకుని జైలుపాలయ్యారు.

ఈ నేపథ్యంలో బీజేపీ తనను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేసిందని మైనింగ్ కింగ్ మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోనూ కర్ణాటకలోనూ అధికారంలో ఉన్న బీజేపీ తనకు చేసిందేమీ లేదన్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో తాజాగా గాలి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో గాలి జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో చేరికలు కూడా మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డికి ఆయన సొంత సోదరుడు బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి షాక్ ఇచ్చారు. తన సోదరుడు గాలి జనార్దన రెడ్డి సొంత పార్టీ పెట్టడం ముమ్మాటికి తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పోటీ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. సొంతంగా పార్టీ పెట్టవద్దని తన సోదరుడికి సలహా ఇచ్చానని తెలిపారు. అయితే ఆయన సొంత పార్టీతోనే ముందుకు సాగుతానంటే తాను మాత్రం ఏం చేయగలనని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపి టిక్కెట్ పైనే బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం ఖాయమని గాలి సోమశేఖరరెడ్డి ప్రకటించారు. తన సోదరుడు జనార్దన రెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తే ఆయనపై పోటీ చేయడానికి తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార బిజెపిని తాను వీడే ప్రసక్తి లేదని సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ కుటుంబ స్నేహితుడు రవాణా శాఖ మంత్రి బి.శ్రీరాములుతో కలసి తాను బిజెపిలోనే కొనసాగుతానని తేల్చిచెప్పారు. జనార్దన రెడ్డికి నచ్చచెప్పడానికి తాము ఎంతగానో ప్రయత్నించామన్నారు. రాజకీయాలలో ఉన్నపుడు ఓపిక అవసరమని చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేసి తన సోదరుడు జనార్దన రెడ్డి వంద శాతం తప్పు చేశారని తెలిపారు.

తన సోదరుడు జనార్దన రెడ్డి జైలులో ఉండటంతో న్యాయపరమైన విషయాలు చూసుకునేందుకే తాను 2013లో ఎన్నికల్లో పోటీ చేయలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్-కర్నాటక ప్రాంతంలో అధికార బిజెపి విజయావకాశాలపై గాలి జనార్దన రెడ్డి పార్టీ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గాలికి తన సొంత సోదరుడి నుంచే షాక్ తగలడం గమనార్హం. తన సొంత సోదరుడే ఆయన వెంట లేకపోతే మిగిలినవారు ఎలా గాలి జనార్దన్ తో కలిసి నడుస్తారనే చర్చ సాగుతోంది.

మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ కుమార్తె బ్రాహ్మణి తమ పార్టీ తరఫున ఉదృత ప్రచారం నిర్వహిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.