Begin typing your search above and press return to search.

బినామీ ఆస్తులు మ‌ర్చిపోయావేం లోకేశ్?

By:  Tupaki Desk   |   20 Feb 2020 3:29 PM GMT
బినామీ ఆస్తులు మ‌ర్చిపోయావేం లోకేశ్?
X
గుమ్మ‌డికాయ‌ల దొంగెవ‌రంటే భుజాలు త‌డుముకున్న‌ట్లు అన్న‌ది పాత సామెత‌...ఐటీ సోదాల్లో రెండు వేల‌ కోట్ల అక్ర‌మ లావాదేవీలెవ‌రివంటే...చంద్ర‌బాబు ఆస్తుల వివరాలివిగో అన్న‌ది నారా వారి `విజ‌న్ 2020` సామెత‌. వెన‌క‌ట‌కి గుమ్మ‌డికాయ‌లు దొంగిలించ‌లేదంటూ భుజాలు త‌డుముకున్న స‌త్తెకాల‌పు స‌త్తెయ్య‌కు.....ఇపుడు అక్ర‌మాస్తులు మావి కావంటూ బాబు ఆస్తుల‌ను వెల్ల‌డించిన‌ నారా లోకేష్ లాంటి అప‌ర మేధావికి ఆట్టే పెద్ద తేడా లేద‌ని ఇట్టే చెప్పేయ‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలోనే మాలోకంపై ఆస్తుల ప్రకటనపై ప్ర‌భుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఐటీ సోదాల్లో బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌ల‌వ‌డంతోనే చిన‌బాబు ఆద‌రాబాద‌రాగా ఆస్తుల చిట్టా విప్పార‌ని విమ‌ర్శించారు.

మాజీ సీఎం చంద్ర‌బాబు మాజీ పీఏ శ్రీ‌నివాస్ ఇంట్లో ఐటీ సోదాల వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ సోదాల్లో బాబు గుట్టు ర‌ట్ట‌యింద‌ని - త్వ‌ర‌లోనే బాబు మెడ‌కు ఉచ్చు బిగుసుకోనుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు - ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ ఆస్తుల వివ‌రాల‌ను లోకేష్ స్వ‌చ్ఛందంగా వెల్ల‌డించారు. అంతేకాదండోయ్... వైసీపీ నేతలు కూడా తమ ఆస్తులను కూడా ప్రకటించారని లోకేష్‌ సవాల్ విస‌ర‌డం ఈ ఎపిసోడ్‌ కే హైలైట్. అస‌లే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతోన్న మాలోకం....ఈ విధంగా గురివింద‌లా స‌క్ర‌మాస్తుల వివ‌రాలు వెల్ల‌డించి ముద్ద‌`ప‌ప్పు`లో కాలేయ‌డంతో....వైసీపీ నేత‌లు ఎదురుదాడి మొద‌లెట్టారు.

చంద్రబాబు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, ఎవ‌రూ అడ‌గ‌కుండానే లోకేశ్ ఆస్తులను ప్రకటించడం ప‌లు అనుమానాలు రేకెత్తిస్తోంద‌ని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఐటీ విచారణలో వాస్తవాలు, అహ్మద్ పటేల్‌ తో బాబు లింకులు బయటకు వస్తున్నాయనే లోకేశ్ ఆస్తుల వివ‌రాలు ప్రకటించారని విమర్శించారు. అయితే, వీటితో పాటు నారా ఫ్యామిలీకి ఉన్న బినామీ ఆస్తుల వివ‌రాల‌ను కూడా లోకేశ్ బాబు వెల్ల‌డిస్తే అప్పుడు వాస్త‌వాలేమిటో ప్ర‌పంచానికి తెలుస్తాయ‌ని శ్రీ‌కాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయింద‌ని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో సోదాల‌తోనే రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని, బాబు కుటుంబ‌స‌భ్యులు, బినామీల ఇళ్ల‌లో సోదాలు చేస్తే దాదాపు 7ల‌క్ష‌ల కోట్ల అక్ర‌మ లావాదేవీలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశ‌ముంద‌ని అన్నారు. బాబు బినామీ ఆస్తులు బ‌య‌ట‌పెడితే అవినీతి సునామీ వ‌స్తుంద‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.