చంద్రబాబు జైలుకు.. బీజేపీ ప్లానేంటి?

Sun Jul 21 2019 10:30:43 GMT+0530 (IST)

2014-19 ప్రభుత్వ హయాం అదీ.. మోడీ దేశానికి ప్రధానిగా.. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్తలో చెలిమి చేసి చివరి వరకు వచ్చే సరికి హోదా కేంద్రంగా వివాదం చెలరేగి బద్ధశత్రువులయ్యారు. మోడీని గద్దెదింపడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కానీ మోడి గెలిచాడు.. చంద్రబాబు ఓడాడు.ఇప్పుడు తమ ఆగర్భ శత్రువు చంద్రబాబు ఉనికిని లేకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. నలుగురు బీజేపీ ఎంపీలను లాగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు..

అయితే కేంద్రంలో బీజేపీ తరుఫున కీలకంగా ఉన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహన్ ఆపరేషన్ ఏపీలో కీరోల్ పోషిస్తున్నారు. తాజాగా ఆయన ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఏపీలో అంతిమంగా చంద్రబాబును జైలుకు పంపి టీడీపీని లేకుండా చేయడమే అంతిమ వ్యూహమా అన్న ప్రశ్నకు జీవీఎల్ సమాధానమిచ్చారు. వారసత్వ రాజకీయాలతో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా ఉందని.. ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీని నడిపించడానికి ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. అదే బీజేపీలో మాత్రం వారసత్వ రాజకీయాలే లేవని.. ఇక్కడ అంతా కార్యకర్తలదే అధికారమన్నారు. చంద్రబాబు తర్వాత ఉన్న లోకేష్ కు అసలు  లోకజ్ఞానమే లేదన్నారు.  లోకేష్ కు అసలు పార్టీని నడిపే స్థాయిలేదన్నారు. దీన్ని బట్టి బాబును లోపలేసి లోకేష్ ను ఏకాకిని చేసి టీడీపీ పనిపట్టాలని బీజేపీ యోచిస్తున్న జీవీఎల్ మాటల ద్వారా అర్థమవుతోంది.