Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కు అండగా వాళ్లు.. బీజేపీకి దన్నుగా వీళ్లు

By:  Tupaki Desk   |   5 Dec 2020 8:30 AM GMT
టీఆర్ఎస్ కు అండగా వాళ్లు.. బీజేపీకి దన్నుగా వీళ్లు
X
గ్రేటర్ ఎన్నికల ఫలితాన్ని విశ్లేషిస్తుంటే.. ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తాయి. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ లో ఏ పార్టీకి అధికారాన్ని సొంతం చేసుకునేంత మెజార్టీ రాలేదు. దీంతో.. ఇప్పుడేం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. అదే సమయంలో.. గ్రేటర్ పరిధిలోని ఓటర్లను చూస్తే.. నగరం మొత్తం ఒకేలాంటి అభిప్రాయం లేకుండా.. ప్రాంతాల వారీగా తీర్పు ఉండటం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్.. అనూహ్యంగా రెండో స్థానానికి చేరుకున్న బీజేపీ విషయంలోనూ ఈ తీరు కనిపించక మానదు.

తాజాగా టీఆర్ఎస్ కు 55 డివిజన్లు వస్తే.. బీజేపీకి 48.. మజ్లిస్ కు 44 డివిజన్లు దక్కాయి. కాంగ్రెస్ కు రెండు డివిజన్లు దక్కితే.. ఒక డివిజన్ ఫలితాన్ని కోర్టు నిర్ణయం కారణంగా నిలిపివేశారు. తొలుత టీఆర్ఎస్ కు వచ్చిన 55 డివిజన్లలో నగరానికి ఒకవైపు ఉంటే.. కుకట్ పల్లి.. కుత్భుల్లాపూర్.. శేరిలింగంపల్లి.. పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండే 24 స్థానాల్లో.. 21 స్థానాలు గులాబీ పార్టీ ఖాతాలో పడ్డాయి. అంటే.. 40 శాతం సీట్లు ఈ నాలుగునియోజకవర్గాల్లోనే సొంతం చేసుకుంది. మిగిలిన 34 స్థానాల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు.. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు స్థానాలు.. మల్కాజిగిరిలో ఐదు.. ఉప్పల్ లో ఆరు.. ఖైరతాబాద్ లో నాలుగు డివిజన్లను సొంతం చేసుకున్నారు. అంటే.. నగరశివారుతో పాటు.. నగరం మధ్యలో టీఆర్ఎస్ అధిక్యత కనిపించింది.

అదే సమయంలో బీజేపీ విషయానికి వస్తే.. ఆ పార్టీకి వచ్చిన 48 డివిజన్లలో నగరానికి ఒకవైపు ఉండే ఎల్ బీనగర్.. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 13 స్థానాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. ఈ రోజున బీజేపీ ఇన్ని డివిజన్లు సొంతం చేసుకోవటానికి కారణం.. ఈ రెండు నియోజకవర్గాల్లోని అన్ని సీట్లను సొంతం చేసుకోవటమే. అదే సమయంలో గోషామహల్.. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదేసి చొప్పున పది స్థానాల్ని సొంతం చేసుకుంది. అంటే.. బీజేపీ సాధించిన 48 డివిజన్లలో.. కేవలం నాలుగుఅసెంబ్లీ నియోజకవర్గాల్లోనే 23 స్థానాల్ని కైవసం చేసుకుంది. మొత్తం సాధించిన స్థానాల్లో 40 శాతానికి పైనే ఇక్కడి డివిజన్లు ఉన్నాయి.

అదే సమయంలో టీఆర్ఎస్ కు మాంచి పట్టు ఉందని చెప్పే ఉప్పల్.. మల్కాజిగిరి.. సనత్ నగర్.. ఖైరతాబాద్ లాంటి చోట్ల కూడా తన సత్తాను చాటింది. ఉప్పల్ లో రెండు.. మల్కాజిగిరిలో మూడు.. సనత్ నగర్ లో రెండు.. ఖైరతాబాద్ లో రెండు చొప్పున డివిజన్లను సొంతం చేసుకున్నాయి. అంటే.. ప్రతి చోట తన ఉనికి ఉందన్న విషయాన్ని బీజేపీ తాజా ఎన్నికల్లో చెప్పుకోగలిగింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టీఆర్ఎస్.. బీజేపీ రెండు పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన నియోజకవర్గాల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ మూడు (పటాన్ చెరువు, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ (రెండు మజ్లిస్ గెలిచినా.. ఆ రెండు స్థానాలు ఎప్పుడూ ఆ పార్టీవే) నియోజకవర్గాల్లో మాత్రమే క్లీన్ స్వీప్ చేయగలిగింది. అదే సమయంలో బీజేపీ.. ఎల్ బీనగర్.. మహేశ్వరం రెండు నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయగలిగింది.