Begin typing your search above and press return to search.

కేసీఆర్ సారుకు అత్యంత విశ్వసనీయమైన వారు సెటిలర్లేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:25 AM GMT
కేసీఆర్ సారుకు అత్యంత విశ్వసనీయమైన వారు సెటిలర్లేనా?
X
వినేందుకు ఏ మాత్రం నమ్మలేనట్లుగా ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పరువు పోకుండా కాపాడినోళ్లు ఎవరైనా ఉన్నారంటే అది.. ఆంధ్రా సెటిలర్లే. ఏ మాత్రం అవకాశం వచ్చినా.. ఆంధ్రోళ్లు అంటూ విరుచుకుపడే వారే.. ఈ రోజు కేసీఆర్ పరువును కాపాడిన వైనం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి. ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన వారంతా తెలంగాణ అధికారపక్షానికి వ్యతిరేకమని.. వారంతా టీఆర్ఎస్ ఓటమి కోసం ప్రయత్నిస్తుంటారన్న దురభిప్రాయం ఉండేది. అయితే.. అదంతా తప్పన్న విషయం తాజాగా వెల్లడైన గ్రేటర్ ఫలితం స్పష్టం చేసింది.

తాజాగా వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ కు వచ్చిన సీట్లలో అత్యధికం ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండే చోట్ల నుంచి రావటమే ఇందుకు నిదర్శనం. గ్రేటర్ లో మొత్తం 150 డివిజన్లు ఉంటే.. 2016లో టీఆర్ఎస్ కు 99 డివిజన్లను సొంతం చేసుకుంది. ఆ ఎన్నిక సమయంలో తీవ్రమైన భయాందోళనలో ఉన్న సెటిలర్లు ఎటువైపు మొగ్గుతారన్న ఆసక్తి ఉండేది. 99 స్థానాలు టీఆర్ఎస్ కు రావటంతో.. సెటిలర్ల ఓటు తొలిసారి టీఆర్ఎస్ వైపునకు మళ్లిందన్నది స్పష్టమైంది.

తర్వాత జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల కారణంగా.. ఏపీ సెటిలర్ ఓటు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉంటుందన్న సందేహం ఉండేది. అయితే.. ఆ విషయం ఏ మాత్రం నిజం కాదన్నది తాజాగా వెల్లడైన గ్రేటర్ ఎన్నికలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ మహానగర పరిధిలోని24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి.. కుకట్ పల్లి.. కుత్భుల్లాపూర్ లో ఎక్కువగా ఉంటారు.

ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 23 డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో మూడింటిలో మాత్రమే బీజేపీ గెలవగా.. గంపగుత్తగా20 డివిజన్లు టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అంటే.. టీఆర్ఎస్ కు వచ్చిన మొత్తం 55 డివిజన్లలో 20 డివిజన్లు సెటిలర్లుకీలకంగా ఉండే మూడు నియోజకవర్గాలనుంచి మాత్రమే రావటం గమనార్హం. ఒకవేళ.. ఈ సీట్లలో ఒక పది సీట్లు టీఆర్ఎస్ కు తగ్గి ఉంటే.. పరిస్థితి.. దారుణంగా మారేది. అప్పుడు టీఆర్ఎస్ కు 45 స్థానాలకు పరిమితమైతే.. బీజేపీ 58 స్థానాల్లో నిలిచేది. అదే జరిగి ఉంటే.. అంతకు మించిన ఘోర అవమానం కేసీఆర్ కు మరొకటి ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ పరువును నిలిపింది ఎవరైనా ఉన్నారంటే.. ఆంధ్రా సెటిలర్లు మాత్రమేనని చెప్పక తప్పదు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉంటారని చెప్పే ముషీరాబాద్.. అంబర్ పేట నియోజకవర్గాల్లో 11 డివిజన్లు ఉంటే.. టీఆర్ఎస్ కు వచ్చిన డివిజన్లు కేవలం మూడు మాత్రమే. సెటిలర్ల ఓటు కేసీఆర్ అధిక్యతను కాపాడిందని చెప్పక తప్పదు.